ఆ రోజు సెలవు ప్రకటించండి: ప్రైవేట్ సంస్థలు, ఐటీ కంపెనీలకు ఈసీ ఆదేశాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana assembly election) నేపథ్యంలో పోలింగ్ (నవంబర్ 30న) రోజున రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు విధిగా సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ (Vikas Raj) స్పష్టం చేశారు. ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేలా సంస్థలు సెలవు ఇవ్వాలని ఆదేశించారు.
గత ఎన్నికల సమయంలో కొన్ని సంస్తలు సెలవు ఇవ్వనట్లు ఫిర్యాదులు వచ్చాయని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. 2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల వేళ సెలవు ఇవ్వనట్లు ఫిర్యాదు అందాయని చెప్పారు. ఈ మేరకు ఎన్నికలకు అన్ని సంస్థలు సెలవు ఇచ్చాయో లేదో పరిశీలించాలని కార్మిక శాఖకు వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. సెలవు ఇవ్వని సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.

విద్యా సంస్థలకు రెండ్రోజుల సెలవులు : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుధ, గురువారాల్లో(నవంబర్ 29, 30) విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ జరగనున్న క్రమంలో నగరంలోని పలు విద్యా సంస్థల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని తరలించనున్నారు.
ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ రజత్ కుమార్ పిలుపు : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ఐఏఎస్ అధికారి, గతంలో రాష్ట్ర ఎన్నికల నిర్వహణ అధికారిగా పనిచేసిన రజత్ కుమార్ చెప్పారు. అయితే పల్లెలతో పోలిస్తే.. నగరాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతోందని రజత్‌కుమార్ తెలిపారు.ఇక్కడ ప్రజలు స్థానిక ప్రజాప్రతినిధులపై తక్కువగా ఆధారపడతారని అందుకే ఎక్కువ మంది ఓటు వేయడానికి ఇష్టపడరన్నారు.
పట్టణాలకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉంటారని.. ఇలాంటి కారణాలతో పట్టణాల్లో పోలింగ్ పట్ల కొన్ని సవాళ్లున్నాయని చెప్పారు. ఏ కారణమైనా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవటం ఎంతో ముఖ్యమన్నారు. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications