పోలీసుల నుంచి తొలి సెల్యూట్ అందుకున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికైన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సాయంత్రానికి ఆయన హైదరాబాద్‌కు చేరుకుంటారు. గురువారం లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎల్బీ స్టేడియంలో చకచకా కొనసాగుతున్నాయి. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆదేశాలను ఆమె జారీ చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ రొనాల్డ్ రాస్.. ఈ ఉదయం ఎల్బీ స్టేడియాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న ప్రమాణ స్వీకార ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఆయన వెంట ఖైరతాబాద్ జోనల్ కమిషనర్, హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు ఉన్నారు.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు ఖరారైన నేపథ్యంలో- ఇక మంత్రివర్గ కూర్పుపై కసరత్తు సాగుతోంది. మంత్రుల జాబితాతో రేవంత్.. ఢిల్లీ వెళ్లారు. ఈ జాబితాపై కాంగ్రెస్ అధిష్ఠానం ఆమోదముద్ర వేయాల్సి ఉంది. దీనిపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వద్ద చర్చించాల్సి ఉంది.
ఢిల్లీలో రేవంత్ రెడ్డి నివాసం వద్ద కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. మల్కాజ్‌గిరి ఎంపీ హోదాలో ఆయన ప్రస్తుతం ఉన్న ఇంట్లోనే నివసిస్తోన్నారు. లోక్‌సభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేయాల్సి ఉంది. నేడో రేపో ఆయన రాజీనామా చేస్తారని చెబుతున్నారు.

కాగా ఈ ఉదయం ఢిల్లీ నివాసంలో తెలంగాణ పోలీసుల నుంచి తొలి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆయన ఇంటి వద్ద బందోబస్తులో ఉన్న పోలీసులు.. ప్రొటోకాల్‌ను అనురిస్తూ రేవంత్‌కు గౌరవ వందనం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి బయలుదేరి వెళ్లడానికి ఇంట్లో నుంచి బయటికి వచ్చిన వెంటనే పోలీసులు గౌరవ వందనం చేశారు.












Click it and Unblock the Notifications