సచివాలయం ప్రారంభం - సీఎం కేసీఆర్ తొలి సంతకం..!!
తెలంగాణ ఠీవిని నిలబెట్టేలా సిద్దమైన నూతన సచివాలయం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణీత ముహూర్తానికి సచివాలయం ప్రారంభించారు. ఈ ఉదయం నుంచి ప్రత్యేకంగా యాగాలు, పూజలు చేసారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి సతీ సమేతంగా యాగాల్లో పాల్గొన్నారు. సుదర్శన యాగం చేసిన తరువాత వాస్తు పూజ నిర్వహించారు. పూర్ణాహుతిలో సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ప్రారంభోత్సవం వేళ సీఎం కేసీఆర్ సచివాలయానికి చేరుకొనే సమయంలో పండుగ వాతావరణ కనిపించింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయ ప్రాంగణంోలకి వస్తూనే వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అక్కడినుంచి నడుకుంటూ వెళ్లిన ముఖ్యమంత్రి యాగశాలను సందర్శించారు. యాగశాలలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అక్కడ నుంచి బ్యాటరీ వాహనంలో లిఫ్టు వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి నూతన సచివాలయంలోని ఆరో అంతస్థులో తన సీటులో ఆశీనులయ్యారు. ఆరు ఫైల్స్ పైన సంతకాలు చేసారు. తొలి సంతకం పోడు భూముల ఫైల్ పైన కేసీఆర్ చేయటంతో పాటుగా మరో అయిదు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. నూతన సచివాలయం ప్రారంభం వేళ సీఎం మొదలు మొత్తం రాష్ట్ర యంత్రాంగం ఒకే చోట కొలువైంది.

ఉదయం నుంచి యాగాలు, పూజల్లో పాల్గొన్న మంత్రులు వరుసగా తమ ఛాంబర్లలో బాధ్యతలు స్వీకరించారు. పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు సీఎం కేసీఆర్ కు కలిసి శుభాకాంక్షల తెలిపారు. పలువురు పాదాభివందనం చేసారు. మంత్రుల శాఖల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగరంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్స్ అందించే ఫైల్ పైన నూతన సచివాలయంలో తొలి సంతకం చేసారు. సీఎస్ శాంతి కుమారి సచివాలయంలో సీఎంకు స్వాగతం పలికారు. సీఎం తొలి సంతకాలు చేసిన తరువాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛాంబర్ లో శాంతి కుమారి బాధ్యతలు స్వీకరించారు. తన కార్యకలాపాలు ప్రారంభించారు.

మరి కాసేపట్లో మంత్రులు, అధికారులు, ఉద్యోగులను ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ సందేశం ఇవ్వనున్నారు. సచివాలయంలో అమలు చేసిన విధానాలు, నిర్మాణ ప్రత్యేకతలను వివరించనున్నారు. దీంతో పాటుగా భవిష్యత్ పాలనా వ్యవహారాల పైన దిశా నిర్దేశం చేయనున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు నూతన సచివాలయం ఆరంభ వేడుకల కోసం తరలి వచ్చారు. వీరందరికి ఆతిథ్యం ఇచ్చేందుకు సచివాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. ఆధ్మాత్మిక కార్యక్రమాలు ముగిసన తరువాత పండుగ వాతావరణంలో నూతన సచివాలయ ఆరంభ వేడుకలు పండుగలా నిర్వహించారు. ఈ రోజు నుంచి నూతన సచివాలయం వేదికగా పాలన ప్రారంభం కానుంది.












Click it and Unblock the Notifications