మోదీ సాబ్ కనబడితే అదే అంటున్నరు.. బాగా చూసుకుంటాం పంపించండి.. సీఎంల కాన్ఫరెన్స్‌లో కేసీఆర్
మాటకు ముందుండే తెలంగాణ సీఎం కేసీఆర్.. బుధవారం ప్రధాని మోదీ నిర్వహించిన ముఖ్యమంత్రుల కాన్ఫరెన్స్ లోనూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. కరోనా వ్యాప్తి, దేశవ్యాప్త లాక్ డౌన్ పై కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. కన్ఫ్యూజన్ నెలకొన్న అంశాలపై క్లారిటీ ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు. పనిలో పనిగా మిగతా సీఎంలనూ కొన్ని విషయాల్లో ఒప్పించారు.

లాక్ డౌన్ పొడగింపు..
దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో మళ్లీ దేశవ్యాప్త లాక్ డౌన్ విధిస్తారనే వదంతులు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ విషయంలో వెంటనే క్లారిటీ ఇవ్వాల్సిందిగా సీఎం కేసీఆర్.. ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు మోదీ కూడా క్రిస్టల్ క్లియర్ గా సమాధానం చెప్పారు.

మీరు కనిపిస్తే అదే..
విషయం ఏదైనప్పటికీ.. ప్రధాని మోదీ టీవీల్లో కనబడితే.. ఆయన లాక్ డౌన్ గురించే మాట్లాడుతారని ప్రజలంతా అనుకుంటున్నారని సీఎం కేసీఆర్ చమత్కరించారు. ‘‘దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారేమోననే ప్రచారం జరుగుతున్నది. ప్రధానమంత్రి మీడియాతో మాట్లాడుతున్నారనగానే అందరూ లాక్ డౌన్ ప్రకటన చేస్తారని అనుకుంటున్నారు. నేను మాత్రం మా ముఖ్యమంత్రులతో ఒకటే మాట చెప్పాను.. మనతో మాట్లాడకుండా మోదీ సాబ్ లాక్ డౌన్ విషయంలో నిర్ణయం తీసుకోరని అన్నాను. దీనిపై స్పష్టత ఇవ్వండి'' అని కేసీఆర్ కోరారు.

ఓన్లీ అన్ లాక్..
జూన్ 30తో అన్ లాక్ 1.0ముగియనున్న నేపథ్యంలో కేసుల తీవ్రతను బట్టి లాక్ డౌన్ 5.0 విధిస్తారేమోనన్న సీఎంల అనుమానాలకు మోదీ సమాధానమిచ్చారు. ఇకపై దేశవ్యాప్త లాక్ డౌన్ ఉండబోదని, లాక్ డౌన్ 5.0 అంటూ జరిగే ప్రచారాలు వట్టివేనని ప్రధాని క్లారిటీ ఇచ్చారు. ‘‘దేశంలో మళ్లీ లాక్ డౌన్ ఉండదు. నాలుగు దశల లాక్ డౌన్ ముగిసింది. అన్ లాక్ 1.0 నడుస్తున్నది. రాబోయే రోజుల్లో అన్ లాక్ 2.0 ఎలా అమలు చేయాలనే విషయంపై మనమంతా చర్చించుకోవాలి'' అని స్పష్టం చేశారు.

కొద్ది రోజుల్లో అంతా నార్మల్..
ప్రధానితో కాన్ఫరెన్స్ సందర్భంగా తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యలను సీఎం కేసీఆర్ వివరించారు. రాష్ట్ర యంత్రాంగం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నదని, ప్రస్తుతం వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉన్నదని, మరణాల సంఖ్య కూడా తక్కువేనని చెప్పారు. హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లో మాత్రమే కరోనా కేసులు నమోదవుతున్నాయని, ఇక్కడ కూడా వ్యాప్తి నివారణకు గట్టిగా పనిచేస్తున్నామని, కొద్ది రోజుల్లోనే వ్యాప్తి అదుపులోకి వస్తుందనే విశ్వాసముందని కేసీఆర్ వివరించారు.
Recommended Video

నితీశ్ బాబుకు నివేదన..
సీఎంల కాన్ఫరెన్స్ లో వలస కూలీల తరలింపు అంశాన్ని కూడా కేసీఆర్ ప్రస్తావించారు. వివిధ రాష్ట్రాల నుంచి కూలీలు, కార్మికులు, హమాలీలు మళ్లీ పని చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలన్నారు. బీహార్ నుంచి వచ్చే హమాలీలను అక్కడి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వారిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ముఖ్యమంత్రి సరదాగా స్పందించారు. ‘‘నితీష్ గారు, మేము తెలంగాణలో మీ హమాలీలను బాగా చూసుకుంటాం. మా సిఎస్ కూడా మీ బీహార్ వారే. దయచేసి పంపించండి'' అని కేసీఆర్ అన్నారు.












Click it and Unblock the Notifications