భారత రాయబారితో సీఎం, 'చైనానే కుప్పకూలింది.. ఇక కెసిఆర్ ఏం తెస్తారు'
బీజింగ్/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల సేకరణ లక్ష్యంగా చైనాలో పర్యటిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెండో రోజు బిజీబిజీగా ఉన్నారు. మంగళవారం డేలియన్ నగరంలో పర్యటిస్తున్న కేసీఆర్ చైనాలో భారత రాయబారి అశోక్ కాంతాతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో నూతన పారిశ్రామిక విధానంపై చర్చించారని సమాచారం. ఈ భేటీలో కేసీఆర్‌తో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ కేశవ రావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన పది రోజుల చైనా పర్యటన ప్రారంభమైంది. సోమవారం ఉదయం పది గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన సీఎం బృందం రాత్రి ఎనిమిది గంటల సమయంలో చైనా నగరం డాలియన్ చేరుకుంది.
అంతకుముందు ఉదయం క్యాంపు కార్యాలయం నుంచి కాన్వాయ్‌లో నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న సీఎం ప్రత్యేక మార్గంగుండా వెళ్లి విమానం ఎక్కారు. అప్పటికే పర్యటనకోసం సిద్ధంగా ఉన్న మంత్రులు, అధికారులతో కలసి సరిగ్గా పది గంటలకు ప్రత్యేక విమానం టేకాఫ్ తీసుకుంది.

సిఎం బృందంలో... ముఖ్యమంత్రి వెంట పర్యటనకు వెళ్లిన వారిలో ఎంపీ కేశవ రావు, స్పీకర్ మధుసూదనా చారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, జగదీశ్ రెడ్డి, ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలా చారి, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే బాలరాజు, సీఎంవో అధికారులు నర్సింగ్ రావు, రాజశేఖర్ రెడ్డి, సీఎం రాజకీయ కార్యదర్శి శేరిసుభాష్ రెడ్డి, టీ న్యూస్ ఎండీ సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు.
చైనా పరిస్థితే బాగాలేదు: పొన్నం
కెసిఆర్ చైనా పర్యటన పైన విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఓ వైపు రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే మరోవైపు చైనా పర్యటన ఇప్పుడేమిటని విపక్ష నేతలు మండిపడుతున్నారు.
కరీంనగర్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ మంగళవారం మాట్లాడుతూ... కేసీఆర్ బయలుదేరిన విమానం ఖర్చు అక్షరాలా రెండున్నర కోట్ల రూపాయలన్నారు. కేసీఆర్ చైనా వెళ్ళిన తీరు రాచరికాన్ని గుర్తు చేస్తోందన్నారు.
ఓ వైపు రైతులు కష్టాలతో సహజీవనం చేస్తూ, ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కేసీఆర్‌కు చైనా పర్యటన కావాల్సి వచ్చిందా? అని నిలదీశారు. అసలు చైనా పరిస్థితే దారుణంగా ఉందని, మార్కెట్లు కుప్పకూలాయని, ఇలాంటి పరిస్థితుల్లో చైనా నుంచి కేసీఆర్ ఏం పెట్టుబడులు తీసుకొస్తారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications