
కడెం ప్రాజెక్ట్ వద్ద పోటెత్తిన వరద: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి తెలంగాణా సీఎం కేసీఆర్ ఫోన్; కీలక సూచనలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండుకున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నిర్మల్ జిల్లాలో గత కొద్ది రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాల దెబ్బకు కడెం ప్రాజెక్టు కు వరద పోటెత్తింది. కడెం ప్రాజెక్టుకు పూర్తిస్థాయి నీటిమట్టం చేరడంతో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కడెం పరివాహక ప్రాంతాలలో మొదట 12 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు వరద ఉధృతి పెరగటంతో ఇప్పుడు 20 గ్రామాల ప్రజలను అలెర్ట్ చేస్తున్నారు. ముంపుకు గురయ్యే 20 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.
ఇక జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కడెం ప్రాజెక్టు వద్ద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కడెం డ్యామ్ తెగిపోయే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు వరద పోటెత్తిన నేపథ్యంలో తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కి ఫోన్ చేసి ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పరిస్థితిని సమీక్షించాలని, తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

ఇక ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి సహాయ చర్యలకు సంబంధించిన అన్ని వివరాలను సీఎం కేసీఆర్ కు తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వివరించారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్టు కు 4.97లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్టు ఉన్న 18 గేట్లలో 17 గేట్లు ఎత్తి మూడు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఒక గేటు పనిచేయకపోవడంతో 17 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. కానీ నీటిని అదే స్థాయిలో దిగువకు విడుదల చేయలేని పరిస్థితి ఉంది.
ఈ క్రమంలోనే ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో ఊర్లు విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. కడెం, దస్తురాబాద్ మండలాలకు చెందిన ఇరవై గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ఊరూరా దండోరా వేయిస్తూ ప్రజలను అలర్ట్ చేస్తున్నారు అధికారులు.