జల వివాదం: కుండబద్దలు కొట్టిన కేసీఆర్-ముమ్మాటికీ అక్రమమేనని-రాజీ లేని పోరాటానికి సిద్ధం...
ఆంధ్రప్రదేశ్‌తో నెలకొన్న జల వివాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన వైఖరిని కుండబద్దలు కొట్టారు. కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ముమ్మాటికీ అక్రమమేనని తేల్చి చెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు సగం వాటా దక్కాల్సిందేనని అన్నారు. 811 టీఎంసీల నికర జలాల్లో ఇరు రాష్ట్రాలకు 405.5టీఎంసీల చొప్పున నీటి పంపిణీ జరగాలన్నారు.
పర్యావరణ అనుమతులు లేకపోయినా,ఎన్‌జీటీ స్టే ఇచ్చినా ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్‌ను నిర్మించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కృష్ణా నదిపై ఏపీ ప్రాజెక్టులకు సంబంధించి శనివారం(జులై 3) నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.

రాజీ లేని పోరాటమే... : కేసీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటాపై రాజీ లేని పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం గుర్తించే ప్రసక్తే లేదన్నారు. ఒక్క చుక్క నీటి కేటాయింపులు లేకపోయినప్పటికీ... సరైన అనుమతులు కూడా లేకుండా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మించడం సరికాదన్నారు.
కేవలం సర్వే మాత్రమే జరుపుతున్నామని చెప్పి... ఆ ముసుుగులో ఏకంగా ప్రాజెక్టునే నిర్మించడం తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీయడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తే జైలుకు పంపిస్తామని ఎన్‌జీటీ చేసిన హెచ్చరికలను సైతం ఏపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు.

విద్యుత్ ఉత్పత్తి ఆపే ప్రసక్తే లేదు : కేసీఆర్
శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తి లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణకు కేటాయించిన నీటి ద్వారానే విద్యుత్ ఉత్పత్తి జరుపుతున్నామని... ఇందులో అభ్యంతరాలకు తావు లేదని అన్నారు. ఇదే విషయాన్ని ట్రిబ్యునల్స్,కేఆర్ఎంబీలతో పాటు న్యాయస్థానాల దృష్టికి ఈ విషయం తీసుకెళ్తామన్నారు.
తెలంగాణలో ఎత్తిపోతల ప్రాజెక్టులను చేపట్టడంతో విద్యుత్ ఉత్పత్తి అవసరం పెరిగిందని తెలిపారు. జల విద్యుత్ ద్వారానే లిఫ్టులను నడుపుతామని చెప్పారు. పొరుగు రాష్ట్రాలకు న్యాయంగా దక్కాల్సిన వాటాను ఉపయోగించుకునేందుకు తాము సహకరిస్తామని... కానీ కేటాయింపులు లేకపోయినా జలాలను వాడుకుంటామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

అక్రమ ప్రాజెక్టులుగా తీర్మానం
ఏపీ చేపట్టిన పోతిరెడ్డిపాడు,రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టులను అక్రమ ప్రాజెక్టులుగా తాజా సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తీర్మానించింది. ఈ ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం గుర్తించదని తేల్చి చెప్పారు. పోతిరెడ్డిపాడుకు కేవలం వరద జలాలను మాత్రమే వాడుకుంటామని గతంలో అనేకమార్లు చెప్పిన ఏపీ ప్రభుత్వం... ఇప్పుడు తెలంగాణకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తామంటే సహించేది లేదన్నారు.
పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా కృష్ణా జలాలను సముద్రంలోకి వృథాగా పోనిస్తున్నారన్న విమర్శలు సరికాదన్నారు. అవసరమైతే ఆ నీటిని ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టా అవసరాలకు వాడుకోవచ్చన్నారు.

త్రిసభ్య సమావేశం రద్దు చేయండి...
ఈనెల 9న జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశాన్ని రద్దు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈనెల 20 తర్వాత పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు.తెలంగాణ ఎజెండాను అందులో చేర్చాలని చెప్పారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై కేఆర్ఎంబీ సమావేశంలో బలంగా గొంతెత్తుతామని చెప్పారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటాపై ఏపీ ఫిర్యాదులు చేయడం సమంజసం కాదని అన్నారు.












Click it and Unblock the Notifications