విద్వేషం చిమ్మితే అభివృద్దికి ఆమడ దూరం, కేంద్రంపై సీఎం కేసీఆర్ నిప్పులు
సీఎం కేసీఆర్ కూడా తగ్గడం లేదు. బీజేపీ, ప్రధాని మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. సమయం దొరికితే చాలు రెచ్చిపోతున్నారు. దేశాన్ని కులమతాల పేరుతో విడదీసే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. విద్వేషం పెచ్చరిల్లితే కోలుకోవడం కష్టమని పేర్కొన్నారు. చైనా మాదిరిగా కులమత రహితంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో 58 ఏళ్లు దగా పడ్డామని.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని చెప్పారు. బుధవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
పరిపాలన దగ్గరగా ఉంటే చక్కగా పనులు జరుగుతాయని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పింఛన్లు అందిస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం, జీఎస్డీపీ పెరిగాయన్నారు. దేశంలో నిరంతరంగా 24 గంటలు కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. హైదరాబాద్‌లో కరెంటు పోదు.. ఢిల్లీలో 24 గంటలు కరెంటు రాదు. తెలంగాణ ఉద్యోగులు దేశంలో ఎక్కువ వేతనం పొందుతున్నారు. పేద ఆడ పిల్లల పెళ్లికి రూ.లక్ష సాయం చేస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని చెప్పారు.

గతంలో ముసలివాళ్లను ఇంట్లో నుంచి వెళ్లగొట్టేవారని.. ఇప్పుడు తమ ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పింఛను పుణ్యమా అని ఆ బాధ తప్పిందని సీఎం కేసీఆర్ వివరించారు. ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు, కిడ్నీ బాధితులకు పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. గతంలో తెలంగాణ రాష్ట్రం నుంచి దుబాయ్, ముంబైకు వలస వెళ్లేవారని.. ఇప్పుడు చాలా రాష్ట్రాల నుంచి తెలంగాణకు ప్రజలు వలస వస్తున్నారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications