కార్మికుల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం.. మే డే విషెస్ తెలిపిన సీఎం రేవంత్
నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా ప్రభుత్వ పాలనలో మే డే స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరించిందని పేర్కొన్నారు. కార్మికులకు గౌరవం, సమానత్వం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.
అంతే కాకుండా రాష్ట్ర అభివృద్ధిలో కార్మికులే అసలైన భాగస్వాములని, వారి శ్రేయస్సు కోసమే కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నామని సీఎం తెలిపారు. నూతన పారిశ్రామిక విధానం ఉత్పత్తి, సేవారంగాల బలోపేతానికి తోడ్పడుతుందని, ప్రపంచ స్థాయిలో ప్రశంసలు పొందుతోందని చెప్పారు.

గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ సంక్షేమ బిల్లు..
కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ చర్యల్ని గుర్తు చేసిన సీఎం.. అసంఘటిత రంగ గిగ్ వర్కర్ల కోసం రూ. 5 లక్షల ప్రమాద బీమా అమలులో ఉందని తెలిపారు. త్వరలోనే తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ సంక్షేమ బిల్లు - 2025 ను ప్రవేశపెడతామని ప్రకటించారు. అంతే కాకుండా గల్ఫ్ దేశాల్లో పని చేసే తెలంగాణ కార్మికుల కోసం 'ప్రవాసీ ప్రజావాణి' అనే కార్యక్రమాన్ని ప్రారంభించామని సీఎం తెలిపారు. ఆయా దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని పేర్కొన్నారు.
మరోవైపు చేనేత రంగాన్ని ఆదుకునేందుకు రుణమాఫీ అమలు చేశామని పేర్కొన్న సీఎం, ప్రభుత్వ శాఖల్లో వున్న పెండింగ్ కారుణ్య నియామకాలను భర్తీ చేశామని వివరించారు. కార్మికుల జీవితాల్లో స్థిరత, భద్రత, అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. సింగరేణిలో పనిచేసే కార్మికులకు దసరా, దీపావళి పండుగలకు ముందే బోనస్ ఇచ్చామన్నారు. అలాగే తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకు రూ. 5 వేలు చొప్పున బోనస్ మంజూరు చేయడం జరిగిందన్నారు. పైగా, కార్మికులకు కోటి రూపాయల బీమా సౌకర్యాన్ని బ్యాంకుల సహకారంతో కల్పించినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం కార్మికులు అందరికీ మే డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అన్ని రంగాల్లో వారి కృషి ఎనలేనిదని కొనియాడుతున్నారు.












Click it and Unblock the Notifications