Black Fungus: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం... ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్పత్రులకు కీలక ఆదేశాలు...
ఇటీవల తెలంగాణలో బ్లాక్ ఫంగస్(మ్యుకోర్‌మైకోసిస్) కేసులు నమోదవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్‌ఫంగస్‌ను గుర్తించదగిన వ్యాధిగా ప్రకటించింది. బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించిన బాధితుల సమాచారాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు వైద్య ఆరోగ్య శాఖకు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ ఫంగస్ కేసులకు సంబంధించి ప్రతిరోజు రిపోర్టులు ఇవ్వాలని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆదేశాలిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బ్లాక్‌ఫంగస్‌ను ఎపిడమిక్ యాక్ట్ 1897లో చేర్చిన సంగతి తెలిసిందే.
Recommended Video
బ్లాక్ ఫంగస్ చికిత్సకు హైదరాబాద్ కోఠిలోని ఈఎన్‌టీ ఆస్పత్రిని ప్రభుత్వం ఇటీవలేనోడల్ కేంద్రంగా మార్చింది.
దేశంలో మొదట గుజరాత్,ఢిల్లీలో బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి. గుజరాత్‌లో బ్లాక్ ఫంగస్ సోకిన దాదాపు 40 మంది కంటి చూపు కోల్పోయారు. కరోనా నుంచి కోలుకుని రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు బ్లాక్ ఫంగస్ బారినపడుతున్నారు. కరోనా చికిత్సలో అధికంగా స్టెరాయిడ్స్ ఇవ్వడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. కాబట్టి మోతాదుకు మించి స్టెరాయిడ్స్ వాడవద్దని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.

కరోనా సోకి ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్నవారు హ్యుమిడిఫయర్లలో స్టెరైల్ నీటిని కాకుండా సాధారణ నీటిని ఉపయోగించడం కూడా బ్లాక్ ఫంగస్‌కు కారణమని అహ్మదాబాద్‌కు చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్ అతుల్ అభ్యంకర్ తాజాగా వెల్లడించారు. ఆక్సిజన్‌కు ఉపయోగించే హ్యుమిడిఫయర్లలో స్టెరైల్ నీటినే ఉపయోగించాలి. కానీ, ప్రైవేట్ ఆస్పత్రులు, కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లు, ఇళ్లలో ఉండి ఆక్సిజన్ పెట్టుకుంటున్న వారు సాధారణ నీటినే వాడుతున్నారని ఆయన పేర్కొన్నారు.దీంతో ఆ నీటిలో ఉండే బాక్టీరియా కారణంగా బ్లాక్ ఫంగస్ సోకే ప్రమాదం ఏర్పడుతోందన్నారు.
డయాబెటీస్ ఉన్నవారు బ్లాక్ ఫంగస్ బారినపడే ప్రమాదం ఎక్కువ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ ఫంగస్ కళ్లు,ముక్కు,నోటి భాగాలపై ప్రభావం చూపుతుంది.
బ్లాక్ ఫంగస్ సోకినవారిలో జ్వరం,దగ్గు,ఛాతినొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే కంటి చుట్టూ ఉండే కండరాలు బిగుసుకుపోయి అంధత్వానికి దారితీయవచ్చు. ఫంగస్ ముక్కు నుంచి మెదడుకు చేరితే మరణం సంభవించవచ్చు. అయితే బ్లాక్ ఫంగస్ కొత్త వ్యాధి ఏమి కాదని... దానికి చికిత్స ఉందని వైద్యులు చెబుతున్నారు. సకాలంలో చికిత్స తీసుకోవడం ద్వారా బ్లాక్ ఫంగస్ నుంచి కోలుకోవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications