ఆ విషయం తేలిన తర్వాతే గోదావరిపై కొత్త ప్రాజెక్టులు - భట్టి
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. మిగులు జలాల్లో తెలుగు రాష్ట్రాల వాటాలు తేలిన తర్వాతే గోదావరిపై కొత్త ప్రాజెక్టులు నిర్మించడం చట్టబద్ధం, న్యాయబద్ధమని ఆయన స్పష్టం చేశారు. అసలు తెలంగాణ ఏర్పడటానికి ప్రధాన కారణమే నదీ జలాల వినియోగమేనని భట్టి గుర్తుచేశారు.
ఈ మేరకు భట్టి మాట్లాడుతూ.. తెలంగాణ తెచ్చుకున్నదే నదీ జలాల కోసం, బీడు భూములను సాగులోకి తెచ్చుకోవడం కోసం అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయ్యి, వాటాల కేటాయింపు జరగడం తర్వాతే మిగులు జలాల అంశంపై స్పష్టత వస్తుందని చెప్పారు.

అలానే ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్, దేవాదుల వంటి ప్రధాన ప్రాజెక్టులు ఇంకా పూర్తికాలేదని భట్టి తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తి కాకముందే కొత్త ప్రాజెక్టులపై చర్చ జరగడం అన్యాయం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టుల పూర్తి తర్వాతనే వాటాలను తేల్చి, మిగిలిన నీటిని వాడుకోవచ్చని స్పష్టం చేశారు. తమ అవసరాలు తీరకముందే దిగువ ప్రాంతాల్లో ప్రాజెక్టులు కడితే ఆ తర్వాత కేటాయింపుల సమస్యలు మరింత పెరుగుతాయని భట్టి హెచ్చరించారు. సముద్రంలోకి వెళ్లే నీరు వృథా అవుతుందని చెప్పడం ఒక తప్పుదారి చూపే వాదన అని ఆయన వ్యాఖ్యానించారు.
నీటి వాటాలను నిర్ధారించడం, రాష్ట్రాల మధ్య సమానంగా పంచడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని ఆయన తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా నిలబడిందని భట్టి అన్నారు. అసంతృప్తి ఉందని ప్రచారం చేయడం కొందరి కుతంత్రం మాత్రమేనని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశాల దృష్టితో పాలన చేస్తారని, ఆయన విధానాలు రాష్ట్ర ప్రయోజనాలకే కట్టుబడి ఉంటాయని భట్టి తెలిపారు. జగన్ చేసిన ఆరోపణలు వ్యక్తిగతమైనవే తప్ప వాస్తవం కాదని ఆయన వ్యాఖ్యానించారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం వరద నీటిని వినియోగించడం సమర్థించారు. దాంతో ఈ అంశం రెండు రాష్ట్రాల మధ్య రాబోయే రోజుల్లో చర్చలకు దారి తీసే అవకాశముంది.
మరోవైపు విశాఖపట్నంలో జరిగిన 'ఓట్ల చోరీ' నిరసన కార్యక్రమంలో కూడా భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడం పౌర హక్కుల ఉల్లంఘన అని విమర్శించారు. అర్హులైన ఓటర్లను తొలగించి, బోగస్ ఓట్లను చేర్చడం ద్వారా బీజేపీ లబ్ధి పొందిందని ఆరోపించారు. ఈ అంశంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధారాలతో సహా మోడీ ప్రభుత్వాన్ని నిలదీశారని గుర్తుచేశారు. అయినప్పటికీ ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ఆయన తీవ్రంగా విమర్శించారు.












Click it and Unblock the Notifications