తెలంగాణలో రూ. 745 కోట్లు విడుదల- ఆ డబ్బులన్నీ వచ్చేస్తాయ్
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త వినిపించింది. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసం 745 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చర్యతో వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి భారీ ఊరట లభించింది. పెండింగ్ లో ఉంటూ వచ్చిన వారి బిల్లులన్నీ కూడా క్లియర్ అయ్యాయి.
నిజానికి, ఉద్యోగ సంఘాలు, వివిధ కార్పొరేషన్లలల్లో పని చేస్తోన్న ట్రేడ్ యూనియన్లకు ఇచ్చిన హామీకి అనుగుణంగా, గత సంవత్సరం జూన్ నుండి ప్రతి నెలా కనీసం రూ. 700 కోట్లను ఉద్యోగుల బిల్లుల క్లియరెన్స్ కోసం మంజూరు చేస్తున్నామని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో పాటు గ్రామ పంచాయతీలకు 389 కోట్ల రూపాయలను కూడా విడుదల చేశారు. ఇది క్షేత్రస్థాయి పాలనను బలోపేతం చేసి, స్థానిక సంస్థలు సజావుగా పనిచేయడానికి సహాయపడుతుందని వ్యాఖ్యానించారు.

విడుదలైన నిధులు సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలను మాత్రమే కాకుండా, పలు కీలకమైన చెల్లింపులను కూడా కవర్ చేస్తాయి. ఇందులో పదవీ విరమణ చేసిన వారికి గ్రాట్యుటీ, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ విత్‌డ్రాయల్స్, వివిధ రకాల ఉద్యోగుల అడ్వాన్స్‌లు ఉన్నాయి. ప్రస్తుతం కేటాయించిన రూ. 745 కోట్లు ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపుల కోసం ప్రత్యేకంగా ఉద్దేశించినది.
ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి తమ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క చెప్పారు. గతంలో ఎదురైన బ్యూరోక్రటిక్ జాప్యాలు లేకుండా, ఉద్యోగుల నిధులు ప్రతినెలా క్రమబద్ధంగా విడుదలయ్యేలా ప్రత్యేక 'గ్రీన్ ఛానెల్'ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. గత ప్రభుత్వ పాలనలో ఉద్యోగులకు సంబంధించిన చెల్లింపులలో బకాయిలు పేరుకుపోయేవని, నిధుల విడుదలలో జాప్యం కారణంగా, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తరచుగా గ్రాట్యుటీ కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేదని అన్నారు.
ఆర్థిక క్రమశిక్షణను పునరుద్ధరించడానికి, ప్రస్తుత ప్రభుత్వం 'గ్రీన్ ఛానెల్' యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇది ఉద్యోగుల చెల్లింపులకు ప్రాధాన్యత ఇస్తుంది. జీతాలు, పెండింగ్ బిల్లుల నిధులు ట్రెజరీ ద్వారా వేగంగా వెళ్లేలా చూస్తుంది. ఈ విధానంలో ఇదివరకు 700 కోట్ల రూపాయలు పెండింగ్ నిధులు విడుదల అయ్యాయి. గతంలో రూ. 183 కోట్ల నిధులను ఒక విడతగా విడుదల చేశారు. దీన్నీ క్రమబద్దీకరించారు.












Click it and Unblock the Notifications