TS Polls: కారు డోర్లలో పెట్టి తరలిస్తున్న రూ. 1.20 కోట్లు సీజ్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడుతోంది. తాజాగా, బుధవారం నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. రూ. 1.20 కోట్ల నగదు పట్టుబడింది. అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న క్రమంలో నాచారం పోలీస్ స్టేషన్‌కు సమీపంలోని ప్రధాన రోడ్డులో ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఎస్సైలు గంగాధర్ రెడ్డి, సారంగపాణి సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా నాగోల్‌కు చెందని సునీల్ రెడ్డి మెకానిక్ శరత్ బాబుతో కలిసి కారులో నాచారం నుంచి భువనగిరి వెళ్తున్నారు. వారి కారును పోలీసులు తనిఖీ చేస్తుండగా.. అనుమానాస్పదంగా వ్యవహించడంతో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

ఈ క్రమంలో కారులో ఉన్న సునీల్ రెడ్డి భయపడి.. తాము కారు డోర్ల స్క్రూలను తీసి అందులో నగదు రవాణా చేస్తున్నట్లు చెప్పాడు. దీంతో పోలీసులు నగదు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. పట్టుబడింది హవాలా నగదా? రాజకీయ నాయకులదా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అడిషనల్ డీసీపీ వెంకటరమణ తెలిపారు.
ఐదు రాష్ట్రాల్లో తెలంగాణలోనే అత్యధికం
దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీ మొత్తంలో సొమ్మ లభ్యమైంది. మొత్తం ఐదు రాష్ట్రాల్లో కలిపి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన రూ. 1760 కోట్ల విలువైన డ్రగ్స్, నగదు, బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు సోమవారం తెలిపారు.
ఈ ఐదు రాష్ట్రాల్లో తెలంగాణలోనే అత్యధికంగా సొత్తు పట్టుబడటం గమనార్హం. 2018లో ఈ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వాధీనం చేసుకున్న సొత్తు కంటే.. ఏడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. గతలంలో స్వాధీనం చేసుకున్న మొత్తం కేవలం రూ. 239.15 కోట్లే కావడం గమనార్హం. కాగా, ఈసారి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా 225.25 కోట్ల నగదును సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో రూ.225.25 కోట్ల నగదు సహా మొత్తం రూ.659 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలు ముగిసేనాటికి ఈ గణాంకాలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. మిజోరంలో నగదు లేదా బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను స్వాధీనం చేసుకోలేదని ఎన్నికల సంఘం తెలిపింది. రూ.29.82 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నట్లు వెల్లడించింది.












Click it and Unblock the Notifications