తెలంగాణలో సకాలంలో కాంగ్రెస్‌ను ఆదుకున్న ఆపద్బాంధవుడు: బస్సులు కూడా అరెంజ్ చేశారు
DK Shivakumar: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముమ్మరంగా కొనసాగుతోంది. సరిగ్గా ఈ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అదే దూకుడును ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కొనసాగించింది హస్తం పార్టీ. తొలి గంటలోనే పూర్తిస్థాయి మెజారిటీని సాధించింది.
తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్.. 60. ఈ మార్క్‌ను అలవోకగా అందుకుంది కాంగ్రెస్. తొలి రౌండ్ నుంచే ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చింది. ఎక్కడే గానీ వెనుకంజ వేసినట్లు కనిపించలేదు. పోస్టల్ బ్యాలెట్లలో సాధించిన పైచేయిని ఈవీఎం లెక్కింపుల్లోనూ కంటిన్యూ చేసింది.

కాంగ్రెస్‌ను ఒడ్డెక్కించడంలో కీలకంగా మారారు ఆ పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ (DK Shivakumar). అన్నీ తానై వ్యవహరించారు. తెలంగాణ కాంగ్రెస్‌కు దిశా నిర్దేశం చేశారు. చుక్కానిలా నిలిచారు. పార్టీ కోసం కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున నిధులను సైతం ఖర్చు చేశారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో కూడా డీకే శివకుమారే కీలకంగా వ్యవహరించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 60 సీట్ల కంటే బొటాబొటిగా ఆధిక్యతను సాధించిన ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ఎమ్మెల్యేలను కాపాడుకోవడాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నారు డీకే శివకుమార్.
కొత్తగా ఎన్నికైన వారందరినీ కూడా బెంగళూరుకు తరలించనున్నారు. రిసార్ట్ రాజకీయాలకు తెర తీశారు. ఇప్పటికే బెంగళూరు శివార్లలో మూడు రిసార్టులను బుక్ చేశారు. కొత్తగా గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ మూడు బస్సుల్లో అక్కడికి తరలించనున్నారు. ఈ బస్సులు కూడా హైదరాబాద్ తాజ్ కృష్ణాకు చేరుకున్నాయి.

ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిగా ముగిసిన తరువాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుని ఈ మూడు బస్సులు బెంగళూరుకు తరలి వెళ్తాయని చెబుతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్‌కు రావాల్సిందిగా గాంధీభవన్ నుంచి సందేశాలు వెళ్లాయని సమాచారం. ఈ రాత్రికి వారంతా బెంగళూరుకు బయలుదేరి వెళ్తారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications