చండీగఢ్‌లో మంత్రి హరీష్ రావు: కేంద్రమంత్రి నిర్మలమ్మతో భేటీ: కీలక అంశాల ప్రస్తావన
న్యూఢిల్లీ: వస్తు, సేవా పన్ను కౌన్సిల్ (GST Cuncil) మరోసారి సమావేశం కానుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ సారథ్యంలో జీఎస్టీ కౌన్సిల్ భేటీ అయింది. ఇది 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం. దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు భారీగా పెరిగడం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ రెపోరేట్‌ను పెంచిన ప్రస్తుత పరిస్థితుల్లో జీఎస్టీ కౌన్సిల్ భేటీ కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రులు ఇందులో పాల్గొన్నారు.
చండీగఢ్ వేదికగా జీఎస్టీ మండలి సమావేశమైంది. దేశంలో ద్రవ్యోల్బణం అదుపు తప్పిన విషయం తెలిసిందే. రిటైల్, హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్ అంచనాలకు మించి పెరిగింది. ఏప్రిల్‌లో హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) 15.8 శాతంగా నమోదు కాగా.. మే నాటికి భారీగా పెరిగింది. 15.88 శాతానికి చేరింది. గత సంవత్సరం అంటే 2021 మే నెలతో పోల్చుకున్నా కూడా ఈ సంఖ్య చాలా ఎక్కువ. గత ఏడాది మే నెలలో నమోదైన డబ్ల్యూపీఐ 13.11 శాతమే.

జీఎస్టీ కౌన్సిల్‌లో పాల్గొనడానికి చండీగఢ్ వెళ్లిన తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు నిర్మల సీతారామన్‌ను ప్రత్యేకంగా కలిశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి మంజూరు కావాల్సిన నిధులు, ఇతర అంశాల గురించి ప్రస్తావించారు. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి పర్చడానికి కేంద్రం 900 కోట్ల రూపాయలను విడుదల చేయాల్సి ఉంది.

సకాలంలో నిధులు విడుదల కాకపోవడం వల్ల సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రుణాల మీద ఆధారపడాల్సి వస్తోందని హరీష్ రావు.. కేంద్రమంత్రికి వివరించారు. వీలైనంత త్వరగా బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రుణ పరిమితిని కూడా పెంచాలని కోరారు. ఎఫ్ఆర్‌బీఎం చట్టం కింద రాష్ట్రం తరఫున రుణాలను తీసుకోవడానికి మూడుశాతం వరకు మాత్రమే అనుమతి ఉందని, దీన్ని అయిదు శాతానికి పొడిగించాలని అన్నారు.
పెట్రోల్, డీజిల్, మద్యం అమ్మకాలు, ఎక్సైజ్ అనుబంధ వస్తువులపై మినహా మిగిలిన అన్ని రకాలపై జీఎస్టీ అమల్లో ఉండటం వల్ల కేంద్ర ప్రభుత్వం అత్యధిక ఆదాయాన్ని పొందుతోందని, అదే స్థాయిలో రాష్ట్రాలకు వాటిని బదలాయించాల్సిన అవసరం ఉంది ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications