ఈశ్వర్ సాయి కేసులో అనూహ్య పరిణామం: డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం
తెలంగాణకు చెందిన ప్రముఖ జానపద నృత్యకారిణి, సోషల్ మీడియా స్టార్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన తోటి డాన్సర్ ఈశ్వర్ సాయిపై పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదనే కారణంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అదృష్టవశాత్తూ కుటుంబ సభ్యులు సకాలంలో స్పందించడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించాడంటూ ఈశ్వర్ సాయిపై మాధురి రాథోడ్ ఇటీవలే నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి చేసుకుంటానని ప్రలోభపెట్టి తనను శారీరకంగా లొంగదీసుకున్నాడని ఇందులో పేర్కొన్నారు. ఒకే గదిలో ఉన్న వీరిద్దరినీ ఈశ్వర్ సాయి భార్య పట్టుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈశ్వర్ సాయిపై మోసం, లైంగిక దోపిడీ తదితర సెక్షన్ల కింద కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగి పోలీస్ ఇన్‌స్పెక్టర్ డీ విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు. తనపై అక్రమ సంబంధం ఆపాదిస్తూ ఈశ్వర్ సాయి కుటుంబ సభ్యులు కూడా దూషించారని బాధితురాలు పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లో విచారణను చేపట్టారు.
కేసు పెట్టి అయిదు రోజులు గడుస్తున్నప్పటికీ.. ఇప్పటివరకూ ఈశ్వర్ సాయిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదనే మనస్తాపంతో తాజాగా మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఇంట్లో తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకునేందుకు ప్రయత్నించగా కుటుంబ సభ్యులు వెంటనే తలుపులు పగలగొట్టి ఆమెను రక్షించారు.పోలీసులు కావాలనే అతడిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని, ఈ కారణంతోనే ఆమె బలవన్మరణానికి ప్రయత్నించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఈశ్వర్ సాయి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి అతను ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు చెబుతున్నారు. ముందస్తు బెయిల్ లభించేంత వరకూ అజ్ఞాతంలోకి వెళ్లాడని, అతన్ని గాలించే విషయంలో పోలీసులు పెద్దగా స్పందించట్లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తోన్నారు. ఫిర్యాదు చేసిన లాభం లేదని, విచారణ వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తోన్నారు.













Click it and Unblock the Notifications