పోటాపోటీగా అన్ని పార్టీల దశాబ్ది వేడుకలు; అందరి అజెండా అదే.. తెలంగాణాలో హాట్ పాలిటిక్స్!!
తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా అన్ని రాజకీయ పార్టీలు సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్నాయి. ఈసారి ఎలాగైనా ఎన్నికలలో గెలిచి మూడోసారి అధికారం చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఈసారి ఎలాగైనా బి ఆర్ ఎస్ పార్టీని గద్దె దించాలని బిజెపి, కాంగ్రెస్ లు భావిస్తున్నాయి.
ఏ చిన్న సందర్భం దొరికినా ఎవరికి వారు తమకు అనుకూలంగా ఆ సందర్భాన్ని మలచుకునే పనిలో పడ్డాయి. ఇదే క్రమంలో తాజాగా తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అన్ని పార్టీలు క్యాప్చర్ చేస్తున్నాయి. దశాబ్ది వేడుకలు రాజకీయాలకు వేదికగా మారాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ భారీ ఎత్తున దశాబ్ది వేడుకలకు ప్లాన్ చేస్తే, కాంగ్రెస్ పార్టీ కూడా ఆవిర్భావ వేడుకలకు రెడీ అయింది.

తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ ప్రాణాలను పణంగా పెట్టి సాధించారని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతుంటే, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియాగాంధీ అని, తెలంగాణ సాధన ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే బిజెపి ఆధ్వర్యంలోనూ తెలంగాణ అవతరణ వేడుకలు జరుగుతున్నాయి. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని గోల్కొండ కోటలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ పాత్ర చెప్పడం కోసం రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల వేదికగా కాంగ్రెస్ పార్టీ నేతలు 20 రోజులపాటు వేడుకలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. గాంధీభవన్లో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. విభజన బిల్లు ఆమోదం పొందిన సమయంలో అప్పటి లోక్సభ స్పీకర్ మీరా కుమార్, మాణిక్యరావు ఠాక్రే గాంధీభవన్లో జరిగే వేడుకలలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధన వెనుక కాంగ్రెస్ ఉందని చెప్తున్నారు.
ఇక అధికార బి ఆర్ ఎస్ రాష్ట్రవ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఘనంగా వేడుకలు జరుపుతారు. తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని చాటేలా ఉత్సవాలను నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం 21 రోజుల పాటు గ్రామగ్రామాన విభిన్న కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధించిన ప్రగతిని చెప్పనున్నారు.
ఇక బీజేపీ నేతలు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, రాష్ట్రం అప్పుల కేంద్రంగా, అవినీతి మయంగా మారిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలకు అన్ని రాజకీయ పార్టీలకు ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేయడానికి ఆయుధంగా మారాయి.












Click it and Unblock the Notifications