భవిష్యత్ తెలంగాణ ప్రతిబింబించేలా..!!
ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సమ్మిట్ కు తరలిరండి- ఉజ్వల తెలంగాణలో పాలుపంచుకోండి.. అనే నినాదాన్ని ఖరారు చేసింది ప్రభుత్వం. దీనికి ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, టెక్నాలజీ రంగ నిపుణులు హాజరుకానున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనుందీ సమ్మిట్.
దీనిపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పూర్తిగా ఆర్థిక సదస్సుగా అభివర్ణించారు. రాబోయే 20 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి, అభివృద్ధి ప్రణాళికలను ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని అన్నారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన వార్ రూమ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేంనరేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. సమ్మిట్ కోసం భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న ఏర్పాట్లు, వరుసగా రెండు రోజుల కార్యక్రమాల ప్రణాళిక అంశాలను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. విజన్ డాక్యుమెంట్‌కు తుది రూపు ఇచ్చే విషయంలో సీఎం పలు సూచనలు చేశారు.
వేదిక వద్ద జరుగుతున్న లాజిస్టిక్స్, ఇతర ఏర్పాట్లు, కార్యక్రమాల ప్రణాళికల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ భవిష్యత్తు, అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలకు విజన్ డాక్యుమెంట్‌లో ప్రాధాన్యతనివ్వాలని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ విజన్ డాక్యుమెంట్ డిజిటల్ రూపంలో పారదర్శకంగా, ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే విధంగా చూడాలని సూచించారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలు, దాని ప్రాముఖ్యత, ప్రభుత్వ దార్శనికతను దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదికలో తెలియజేసేలా ఉండాలని అన్నారు. దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు రద్దవుతున్న పరిస్థితుల నేపథ్యంలో, సమ్మిట్‌కు హాజరయ్యే అతిథులకు సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications