పూర్తిస్థాయి ప్రభుత్వం..! అయినా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్..?
హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. మరి తెలంగాణ ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు తెరపైకి తెస్తోంది. మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికలు ముగిసి మెజార్టీ ప్రభుత్వం ఏర్పడింది. మరి పూర్తిస్థాయి బడ్జెట్ కు వెళ్లకుండా తెలంగాణ ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలనుకోవడం వెనుక ఆంతర్యమేంటి అనేది చర్చానీయాంశంగా మారింది.

ఇక్కడ కూడా అదేనా?
ఎన్నికల హామీల అమలుకు కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్. అందులోభాగంగా హామీలు, వాటి అమలు, నిధుల కేటాయింపు.. ఇలా ప్రతి అంశంలో ఆచితూచి అడుగేస్తున్నారు. ఆ మేరకు ప్రతిపాదనలు రూపొందించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో పొందుపరచాలని అధికారులను ఆదేశించారు. ఇటీవలే పంచాయతీలకు ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గాలు ఏర్పడటంతో.. గ్రామాభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లోనే గ్రామాలకు పెద్దమొత్తంలో నిధులు కేటాయించాలని భావిస్తున్నారు కేసీఆర్.

బడ్జెట్ కసరత్తు
మళ్లీ అధికారంలోకి వస్తే.. గతంలో ఇచ్చిన పింఛన్ల కంటే డబుల్ ఇస్తామని ప్రకటించారు కేసీఆర్. ఆ నేపథ్యంలో ఇటీవల అసెంబ్లీ సమావేశంలో పింఛన్ల గురించి ప్రస్తావించారు. ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు అమలు చేస్తామని చెప్పారు. ఆ మేరకు బడ్జెట్ లో ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అదలావుంటే 60 ఏళ్లు దాటినవారికే ఇంతకుముందు పింఛను ఇచ్చేవారు. ఇప్పుడు ఎన్నికల హామీలో భాగంగా ఆ వయసును కాస్తా 57 ఏళ్లకు తగ్గించారు. ఇప్పటివరకు పింఛన్ల కోసం బడ్జెట్ లో 5,043 కోట్లు కేటాయించేది ప్రభుత్వం. పింఛన్ల మొత్తం పెంచడం, అర్హత వయసు తగ్గించడం లాంటి కారణాలతో మరో 5వేల కోట్ల రూపాయల భారం పడనుంది. ఆ మేరకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో నిధులు కేటాయించాల్సిందిగా కేసీఆర్ ఆదేశించడంతో ఆర్థికశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

ఎన్నికల హామీల కోసం..!
రైతుబంధు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే ఆర్థిక సాయం ఈ ఏడాది నుంచి (రెండు పంటలకు) 10 వేల రూపాయలు కానుంది. అయితే దీనికి కూడా
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లోనే నిధులు కేటాయించనుంది సర్కార్. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద రైతులకు ఇచ్చే 6వేల రూపాయల ఆర్థికసాయంపై తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. కేంద్రం ఇచ్చే పథకంలో రైతుబంధును సర్దుబాటు చేయాలా? లేదంటే సెపరేటుగా అలాగే కొనసాగించాలా అనే దానిపై కసరత్తు చేస్తోంది. మొత్తానికి ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడానికే.. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.

దానికే మొగ్గు
కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ రూట్ తప్పిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వాస్తవానికి ఈ బడ్జెట్ లో ఆయా శాఖలకు పద్దులు మాత్రమే కేటాయించాల్సి ఉంటుంది. ఎన్నికలయి కొత్త ప్రభుత్వం కొలువుదీరేంతవరకు ఏయే శాఖకు ఎంత కేటాయించాలనేది ఈ బడ్జెట్ లో పొందుపరచాలి. కానీ పథకాలు, కేటాయింపులకే అధిక ప్రాధాన్యం ఇచ్చారనేది విపక్షాల వాదన. మొత్తానికి ఓట్ల టార్గెట్ గా బీజేపీ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అదలావుంటే ఎన్నికలు పూర్తయి ఫుల్ మెజార్టీతో రెండోసారి కొలువుదీరిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. పూర్తిస్థాయిలో బడ్జెట్ పెట్టకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలనుకోవడం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications