TSPSC: గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడతాయా ? కారణమిదే..!
తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కమిషన్ లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో గతంలో ఇచ్చిన షెడ్యూల్ మేరకు పరీక్షలు జరగడం కష్టమేనని తేలిపోయింది. దీంతో వీటిని వాయిదా వేసి రీషెడ్యూల్ చేయాలా లేక మరిన్ని పోస్టులు కలిపి కొత్త ప్రకటన జారీ చేయాలా అన్న దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.
తెలంగాణలో టీఎస్పీఎస్సీ గ్రూప్-2 పరీక్ష వాయిదా పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వాస్తవానికి గతంలో కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీల్లో ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఇప్పటివరకూ రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, కమిషన్ లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్షకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దీంతో గ్రూప్ 2 పరీక్ష వాయిదా ఖాయంగా తెలుస్తోంది.

ఇప్పటికే గ్రూప్-2 నోటిఫికేషన్ ప్రకారం జారీ చేసిన 783 పోస్టులకు 5 లక్షల 50 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా వచ్చే నెలలో పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే కమిషన్ ఇప్పటివరకూ ఏర్పాట్లు మొదలుపెట్టకపోవడంతో ఈ పరీక్షలు వాయిదా పడతాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ మేరకు త్వరలో కమిషన్ క్లారిటీ ఇవ్వొచ్చని తెలుస్తోంది.
అయితే కమిషన్ మౌనం వెనుక కీలక కారణాలు కనిపిస్తున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీలు, ఇతర అక్రమాల నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించే అవకాశాలున్నట్లు తెలియడంతో కమిషన్ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి సహా పలువురు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త సభ్యుల్ని నియమించాల్సి ఉంది. కాబట్టి సభ్యుల నియామకం పూర్తి చేసి గ్రూప్ 2 పరీక్ష తేదీల్ని రీ షెడ్యూల్ చేస్తారా?, కొత్త పోస్టులను చేర్చి రివైజ్డ్ నోటిఫికేషన్ ఇస్తారా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications