తెలంగాణలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై కొత్త గైడ్‌లైన్స్ !
తెలంగాణ ప్రభుత్వం ఇంజినీరింగ్, వృత్తి విద్యా కళాశాలల్లో ఫీజుల పెంపుపై కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇకపై కళాశాలల ఆర్థిక పరిస్థితులకే కాకుండా, వారి విద్యా ప్రమాణాలను కూడా పరిగణనలోకి తీసుకుని మాత్రమే ఫీజులు నిర్ణయించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
విద్యా ప్రమాణాలు..
- విద్యార్థుల హాజరు
- ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అమలు
- ఆధార్ ఆధారిత ఫీజుల చెల్లింపులు
- పరిశోధనలకు ప్రోత్సాహం
- ఫ్యాకల్టీ అర్హతలు, ల్యాబ్, లైబ్రరీ సదుపాయాలు
ఈ అంశాలు సమగ్రంగా పరిశీలించిన తరువాతే ఫీజులను నిర్ధారించనున్నారు.

ప్లేస్‌మెంట్‌లు, ఫలితాలు ప్రాధాన్యం..
కళాశాలల్లో విద్యార్థుల ప్లేస్‌మెంట్ రికార్డులు, పరీక్షల ఫలితాలు, పరిశ్రమల్లో వారి డిమాండ్ కూడా కీలక ప్రమాణాలుగా ఉంటాయి. ఈ అంశాల్లో మెరుగైన పనితీరును చూపే సంస్థలకు మాత్రమే అధిక ఫీజు వసూలు చేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ర్యాంకింగ్‌లు, నిబంధనల అమలు..
జాతీయ, అంతర్జాతీయ ర్యాంకింగ్‌లు, అలాగే ప్రభుత్వ నిబంధనల అమలు స్థాయి కూడా పరిశీలనలోకి తీసుకోబడతాయి. నిబంధనలను విస్మరిస్తున్న కళాశాలలకు అధిక ఫీజు మంజూరు కానే అవకాశం లేదని అధికారులు హెచ్చరించారు.
ఈ కొత్త విధానం వల్ల విద్యార్థులకు మేలు జరుగనుందని నిపుణులు చెబుతున్నారు. అధిక ఫీజులు వసూలు చేయాలంటే కళాశాలలు తప్పనిసరిగా విద్యా నాణ్యతను పెంచుకోవాలి. దీని వలన ప్రతి కళాశాల మెరుగైన విద్యా ప్రమాణాల కోసం పోటీ పడుతుందని భావిస్తున్నారు. ఈ విధానం ద్వారా విద్యా రంగంలో పారదర్శకత పెంచి, వాణిజ్య ధోరణిని తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని స్పష్టం చేస్తున్నారు.
అంతే కాకుండా రాబోయే రోజుల్లో ఫీజుల నిర్ణయంలో NBA, NAAC వంటి అక్రిడిటేషన్ ప్రమాణాలు, ఇండస్ట్రీలతో భాగస్వామ్యం, స్టార్ట్‌అప్స్, ఇన్నోవేషన్ ప్రోత్సాహం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశముందని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది.












Click it and Unblock the Notifications