• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చూస్కుందామా, తల తెగినా సరే, పశువుకంటే హీనం: కేసీఆర్‌కి రేవంత్

|

మెదక్: మల్లన్న సాగర్ ఉద్యమంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కుర్చీ కిందకు నీళ్లు వస్తున్నాయని, తెలంగాణలో టిడిపి లేదని తెరాస నేతలు చెబుతున్నారని, అసలు ఏ పార్టీ దిమ్మె ఉంటుందో చూసుకుందామని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆదివారం సవాల్ చేశారు.

మెదక్ జిల్లాలో నిర్మించతలపెట్టిన కొమురవల్లి మల్లన్నసాగర్ జలాశయం ముంపు బాధితులకు సంఘీబావంగా ఏటిగడ్డ కిష్టాపూర్‌లో రెండు రోజుల దీక్ష చేసిన రేవంత్ ఆదివారం సాయంత్రం విరమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

తెరాస ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత గతంలో మాదిరిగానే లాఠీచార్జీలు, బాష్పవాయు ప్రయోగాలు, తుపాకుల తూటాల చప్పుళ్లు ఆగడం లేదన్నారు. మల్లన్న సాగర్ కోసం భూములు ఇవ్వకపోతే యువకులు, మహిళలని చూడకుండా కేసులు పెట్టి, భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు.

సీఎం కేసీఆర్‌ కుటుంబం ఎక్కడ అరాచకాలకు, దోపిడీకి పాల్పడినా చూస్తూ ఊరుకోనని, తన తల తెగిపడినా పోరాటం చేస్తానని, తెలంగాణ సమాజం కోసం నిలబడతానని రేవంత్ అన్నారు. మల్లన్న సాగర్‌ నిర్వాసితులకు పునరావాసం, పరిహారం చెల్లింపుపై కేసీఆర్‌ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు.

జీవో 123 ఓ చిత్తు కాగితమని, దాని అమలు వద్దే వద్దని నిర్వాసితులు ఇప్పటికే స్పష్టం చేసినా కలెక్టర్‌ నుంచి సీఎం వరకు ద్వంద్వ వైఖరితో ప్రకటనలు చేశారన్నారు. బాధితులకు అండగా నేను ఉంటానని, మీ బిడ్డగా పోరాడుతానని, మీకు న్యాయ సాయం చేస్తామన్నారు.

సుప్రీం కోర్టు వరకైనా వెళ్లేందుకు టీడీపీ సాయం చేస్తుందన్నారు. మీ ఆవేదనను అర్ధం చేసుకోలేనివారు పశువుల కంటే హీనం అన్నారు. నిర్వాసిత గ్రామాల్లో ఏ తల్లీ కన్నీళ్లు పెట్టుకోనవసరం లేదన్నారు. మీ కన్నీరు ఆపేందుకు కంకణం కట్టుకున్నానని చెప్పారు.

నిర్వాసితులు ఆంధ్రా వారితో కుమ్మక్కయ్యారని సీఎం కేసీఆర్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి ప్రకటనలు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. 21 వేల ఎకరాలు కోల్పోతున్న నిర్వాసితులు తెరాస పార్టీనే మల్లన్న సాగర్‌లో ముంచుతారని హెచ్చరించారు.

50 టీంసీల సామర్థ్యంతో ఎత్తిపోతల పథకం చేపడితే 20 టీఎంసీలు ఆవిరైపోతుందంటూ నీటిపారుదల నిపుణులు హన్మంతరావు ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేశారన్నారు. మేధావులు చెప్పినా, నిపుణులు చెప్పినా, అన్ని పక్షాలు, సంఘాలు, నిర్వాసితులు చెప్పినా మీరు వినరని, మేం చెబితే మమ్మల్నే తిడతారని, వింటే మంచిగా చెబుతామని, లేదంటే దంచి చెబుతామన్నారు.

 Telangana government's GO 123 is scrap of paper, says Revanth Reddy

గద్దె ఎక్కడం కష్టమని, దింపడం సులువేనని, మల్లన్న సాగర్‌ నిర్వాసితుల ఉద్యమమే మీ కుర్చీ కిందకు నీళ్లు తెస్తుందన్నారు. టిడిపిని ఆంద్రోళ్ల పార్టీ అంటే చూస్తూ ఊరుకోమని, ఉద్యమంపై ఎక్కడ దెబ్బ పడుతుందన్న ఉద్దేశంతో అప్పట్లో ఊరుకున్నామని, బెదిరిస్తే బెదిరే కాలం పోయిందన్నారు. దేనికైనా సై అన్నారు.

సిద్దిపేట సెంటరా? సిరిసిల్ల సెంటరా? గజ్వేల్‌ బస్టాండా? చర్చిద్దామన్నారు. రాష్ట్రంలో టిడిపి దిమ్మె ఉండదని తెరాస నాయకుడు అన్నాడని, 24 గంటల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో చూసుకుందామని, నీ పార్టీ దిమ్మె ఉంటుందో, నా పార్టీ దిమ్మె ఉంటుందో చూసుకుందామన్నారు.

నీ పార్టీ దిమ్మె, నీ పార్టీ జెండా ఉంటే నేను రాజకీయాల గురించి మాట్లాడనని సవాల్ చేశారు. ర్యాపిడ్‌ యాక్షన్‌ పోలీసులను పెట్టుకుని మంత్రి హరీశ్‌ ఏటిగడ్డ కిష్టాపూర్‌ చుట్టూ తిరుగుతున్నారని, కానీ, ఇక్కడకు వచ్చి నిర్వాసితుల ఆవేదనను పట్టించుకోవడం లేదన్నారు.

తాను దీక్ష ప్రారంభించగానే ప్రభుత్వం మెట్టు దిగి 2013 చట్టాన్ని అమలు చేస్తామని చెబుతున్నారని, కేసీఆర్, హరీష్‌లు అలా ప్రకటనలు చేస్తే రాజకీయం కోసం అనుకోవచ్చునని, జిల్లా కలెక్టర్ అలా చెప్పడం సిగ్గుచేటు అన్నారు. నా తల తెగిపడ్డా కన్నీరు కార్చుతున్న తల్లులు, అక్కా చెల్లెళ్ల బాధలు తీర్చడానికి మీ వెంట పోరాటం చేస్తానన్నారు. కాగా, ఓ మహిళ రేవంత్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు.

English summary
TTDP working president A Revanth Reddy described the state government’s land acquisition policy in the form of GO 123 as a scrap of paper.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X