తెలంగాణలోని విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే ప్రారంభం
తెలంగాణలోని విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలను నిర్మిస్తోంది. ఇటీవల 20 పాఠశాలలను మంజూరు చేసింది. ఈ మేరకు ఒక్కో పాఠశాలకు రూ.200 కోట్ల చొప్పున మొత్తం రూ.4,000 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇస్తూ విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
అలాగే 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో కీలక మార్పులను చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఈ ఏడాది నుంచి నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ తరగతులను కూడా నిర్వహిస్తోంది. అటు అంగన్ వాడీ కేంద్రాల్లో ఫుడ్ మెనూలో సైతం మార్పులు చేర్పులు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై రాగి జావ పంపిణీ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలల్లో రాగి జావ పంపిణీ ప్రారంభం కానుంది. దాదాపు 18 లక్షల మంది విద్యార్థులకు ఇది ఎంతో మేలు చేస్తుంది. పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలోని ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా వారానికి 3 రోజులపాటు రాగి జావను ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు అయ్యే ఖర్చులో 40 శాతం భరించేందుకు తాజాగా ఆమోదం లభించింది. మిగతా ఖర్చును శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు భరించనుంది. ట్రస్టుతో కలిసి గత రెండేళ్లుగా ప్రభుత్వం రాగిజావను అందిస్తూండగా.. ఈ ఏడాది ఇంకా పంపిణీ ప్రారంభించలేదు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో విద్యార్థులకు మళ్లీ రాగిజావ పంపిణీ ప్రారంభం కానుంది. ఇక ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే సుమారు 18 లక్షల మంది విద్యార్థులకు ఈ రాగిజావ అందించనున్నారు.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 25 వేల బడుల్లో 'పీఎం పోషణ్' పథకం కింద మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. దీనితో పాటుగా వారంలో మూడు రోజులపాటు కోడిగుడ్డు, మరో మూడు రోజులు రాగిజావ ఇస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరం జూన్ 12 న పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అయితే రాగిజావ పంపిణీలో సుమారు రెండున్నర నెలల ఆలస్యం జరిగింది. తాజాగా సెప్టెంబర్ 1 నుంచి రాగిజావ పంపిణీని ప్రారంభించాలని ఉత్తర్వులు వెలువడటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications