రూ.31 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి: కేంద్రానికి తెలంగాణ
హైదరాబాద్: ప్రత్యేక ప్యాకేజీ కింద ఏడాదికి రూ. 7,750 కోట్ల చొప్పున వచ్చే నాలుగేళ్లలో రూ.31 వేల కోట్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇది ప్రధాని కార్యాలయానికి చేరినట్లుగా తెలుస్తోంది.
జలహారం, మిషన్ కాకతీయ పథకాలకు మాత్రమే ఈ నిధులను కోరింది. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో చేపట్టే కార్యక్రమాలకు మద్దతిస్తామని కేంద్రం ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొనటంతో తెలంగాణ ఆర్థిక శాఖ రూ. 56,646 కోట్లు ఇవ్వాలంటూ గత ఏడాది ప్రతిపాదనలు పంపింది.

వెనుకబడిన ప్రాంతాలకు మాత్రమే అడగాలని కేంద్రం స్పష్టం చేయటంతో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ తప్ప మిగతా ఆరు జిల్లాలతో మళ్లీ పంపింది. ఇందులో రహదారులు వంటి కార్యక్రమాలను ప్రతిపాదించటంతో కేంద్రం మళ్లీ వెనక్కు పంపింది.
కేవలం ముఖ్యమైన పథకాలకే నిధులను అడగాలని సూచించింది. దీంతో ఆర్థిక శాఖ మళ్లీ కసరత్తు చేసింది. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలహారానికి రూ.20 వేల కోట్లు, చెరువుల పునరుద్ధరణకు రూ.11 వేల కోట్లు కలిపి మొత్తం రూ.31 వేల కోట్లను నాలుగేళ్లలో ఏడాదికి రూ. 7,750 కోట్లు చొప్పున ఇవ్వాలని కోరింది.












Click it and Unblock the Notifications