Telangana Govt Lands for sale: ప్రభుత్వ భూముల అమ్మకానికి నోటిఫికేషన్ ఎప్పుడంటే...
తెలంగాణలో ప్రభుత్వ భూముల అమ్మకానికి ఈ నెల 15న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. బిడ్ రిజిస్ట్రేషన్లకు జులై 13 చివరి తేదీ అని... 15వ తేదీన వేలం ఉంటుందని తెలిపింది. ఈ నెల 25న ప్రీబిడ్ సమావేశం ఉంటుందని పేర్కొంది. నిధుల సమీకరణలో భాగంగా నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను విక్రయించాలని సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వ భూముల అమ్మకాల్లో భాగంగా హైదరాబాద్ శివారు కోకాపేటలో 49.95 ఎకరాలు,ఖానామెట్‌లో 15.1 ఎకరాలను ప్లాట్లుగా మార్చి విక్రయించనున్నారు. కోకాపేట ప్రభుత్వ భూములను హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో వేలం వేయనుండగా... ఖానామెట్ భూములను టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో వేలం నిర్వహించనున్నారు. జిల్లాల పరిధిలో ప్రజా అవసరాలకు ఉపయోగపడని భూములను కలెక్టర్లు సేకరించాల్సి ఉంటుంది. కనీసం వెయ్యి ఎకరాలకు తగ్గకుండా ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేస్తారు.

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల వద్ద నిరుపయోగంగా ఉన్న భూములను గుర్తించేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూముల గుర్తింపుతో పాటు అభివృద్ధి, వేలానికి సంబంధించి నిర్దిష్ట మార్గదర్శకాలను విడుదల చేసింది.వేలం నిర్వహణ బాధ్యతను నోడల్ ఏజెన్సీకి అప్పగించిన ప్రభుత్వం... ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు నాలుగు కమిటీలను ఏర్పాటుచేసింది. వేలం ప్రక్రియలో పారదర్శకత,ప్రభుత్వ మార్గదర్శకాల అమలును ఈ కమిటీ పర్యవేక్షించనుంది.
నిరుపయోగంగా ఉన్న భూముల్లో న్యాయపరంగా ఎలాంటి చిక్కులు,వివాదాలు లేని భూములను మొదట సేకరించి వాటికి సరిహద్దులు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత మిగిలిన భూములను సేకరిస్తారు. మొదట వాటిని లేఅవుట్స్‌గా మార్చి... ఆపై టీఎస్‌బీపాస్ ద్వారా అన్ని అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటారు. అన్ని రకాల వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటారు. ఆ తర్వాతే వేలం ప్రక్రియ నిర్వహిస్తారు. వేలంలో దాఖలైన బిడ్స్‌ను నోడల్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలోని కమిటీ ఫైనల్ చేస్తుంది. వేలంలో భూమిని లేదా ప్లాట్‌ను దక్కించుకున్న బిడ్డర్‌కు 7 రోజుల్లో సంబంధిత పత్రాలు అందజేస్తుంది. ప్లాట్ల విక్రయం ద్వారా వచ్చే నిధుల్లో 2 శాతం నిధులను వివిధ పనులకు ఉపయోగిస్తారు.












Click it and Unblock the Notifications