రైతు భరోసా నిధుల వేళ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం, తాజా ఆదేశాలు..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా అమలులో కొత్త వారికి అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఇందు కోసం దరఖాస్తు చేసుకునే గడువు ప్రకటించింది. ఈ నెల 30న రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం నిధుల సమీకరణ వేగవంతం చేసింది. ప్రకటించిన విధంగా అదే రోజున రైతుల ఖాతాల్లో నిధులను జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకంలో కొత్త రైతులు చేరేందుకు అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు ఈ పథకంలో నమోదు చేసుకోని రైతులు, కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులు.. సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించి, తమ పేర్లు నమోదు చేసుకునేందుకు గడువు తేదీ ప్రకటించింది. ఈ నెల (జూన్) 15వ తేదీ నాటికి పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు.. రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అర్హులైన రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో)కి గానీ, మండల వ్యవసాయ అధికారి (ఎంఏవో)కి గానీ దరఖాస్తులు, ధ్రువపత్రాలు సమర్పించాలని సూచించింది. కాగా, దరఖాస్తుతోపాటు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్సు కాపీలతోపాటు రైతుభరోసా దరఖాస్తు ఫారాలను సమర్పించాలని పేర్కొంది.

30న రైతుల ఖాతాల్లో నిధుల జమ
రైతులు తమ దరఖాస్తులు, ధ్రువపత్రాలు సమర్పించేందుకు జూలై 5 చివరి తేదీగా ప్రకటించింది. కాగా వ్యవసాయశాఖ అధికారులు సీసీఎల్‌ఏ డేటా ఆధారంగా దరఖాస్తులు తీసుకొని.. రైతుభరోసా పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తే లబ్ధిదారుల జాబితాలో కొత్త రైతులు చేరిపోతారు. రైతుభరోసా పథకానికి ప్రభుత్వం నిధులు సమీకరిస్తోంది. 30న రైతుల ఖాతాల్లో రైతుభరోసా పెట్టుబడి సాయం జమ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 73 లక్షల మంది పట్టాదారులు ఉన్నారు. నిరుడు ఖరీఫ్ సీజన్‌లో వీరికి ప్రభుత్వం 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల నగదు బదిలీ చేసి రికార్డు సృష్టించింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో వేసే అవకాశాలున్నాయి. రోజుకో ఎకరం చొప్పున పెంచుకుంటూ.. 10 ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులకు ఒకేసారి నగదు బదిలీ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మొత్తం ఎనిమిది రోజుల్లోనే నగదు బదిలీ ప్రక్రియ పూర్తిచేయాలని వ్యవసాయశాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లినట్లు సమాచారం.













Click it and Unblock the Notifications