విద్యార్థులకు రేవంత్ సర్కారు గుడ్‌న్యూస్
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రేవంత్ రెడ్డి సర్కారు శుభవార్త చెప్పింది. పర్యాటక, చారిత్రక ప్రాంతాలను విద్యార్థులు ఉచితంగా సందర్శించే అవకాశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్పించారు. 'తెలంగాణ దర్శిని' పేరుతో ఈ మేరకు కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు ఇప్పటికే జారీ అయ్యాయి.
విద్యార్థులు తరగతి గదిలో కూర్చొని విషయాలను పాఠాలుగా వినడం కంటే ప్రత్యక్షంగా చూసి అనుభవించడం వల్ల ఎక్కువ జ్ఞానాన్ని పొందుతారనే శాస్త్రీయ నిరూపణలున్న నేపథ్యంలో చారిత్రక, పర్యాటక ప్రాంతాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం తెలంగాణ దర్శిని కార్యక్రమాన్ని తలపెట్టారు. ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సీఎం రేవంత్.. తెలంగాణ దర్శిని పోస్టర్ ను ఆవిష్కరించారు.
రెండో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్థులను కేటగిరీలుగా విభజించి, ఆయా ప్రాంతాల్లోని పర్యాటక క్షేత్రాలను చూపిస్తారు. రవాణా, ఇతరత్రా ఖర్చుల కోసం ప్రభుత్వం రూ12.10 కోట్ల నిధులు విడుదల చేసింది. తొలి దశలో 1 లక్ష మంది విద్యార్థులను పర్యాటక స్థలాలకు తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నోడల్ ఆఫీసర్లు నియమించే కమిటీలు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. తెలంగాణ దర్శినికి సంబంధించిన విధివిధానాలను జీవోలో పొందుపర్చారు.

చారిత్రక కట్టడాల పరిరక్షణకు చర్యలు
హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే చారిత్రక కట్టడాలను పరిరక్షిస్తూ వాటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పానికి అడుగు ముందుకు పడింది. పలు చారిత్రక పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రతినిధులు ముందుకొచ్చారు.
సీఐఐ తెలంగాణ కౌన్సిల్ ప్రతినిధులతో సీఎం రేవంత్ సచివాలయంలో సమావేశమయ్యారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో నగరంలోని పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు ఆయా సంస్థలు ముందుకొచ్చి సీఎం సమక్షంలో పర్యాటక శాఖతో ఒప్పందాలు చేసుకున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ.. హైదరాబాద్ చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వాటి పరిరక్షణ కోసం పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మూసీ పరివాహన ప్రాంతంలో చారిత్రక భవనాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని, మూసీ ప్రక్షాళన కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు.
పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్దరిస్తున్నామని, త్వరలోనే అందులో శాసనమండలి కార్యకలాపాలు నిర్వహిస్తామని వెల్లడించారు. జూబ్లీహాల్‌కు చారిత్రక ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని దాని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని సీఐఐకి సూచించారు. ఉస్మానియా ఆస్పత్రి భవనాలు, హైకోర్టు, సిటీ కాలేజీ, పురానాపూల్ బ్రిడ్జి వంటి చారిత్రక కట్టడాలను కాపాడుకోవాలన్నారు.
హైదరాబాద్ నగరంలోని పురాతన మెట్ల బావులను పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలఖా మెట్ల బావి పునరుద్దరణను ఇన్ఫోసిస్ సంస్థ, మంచిరేవుల మెట్ల బావిని లైఫ్ సైన్సెస్ సంస్థ దత్తత తీసుకున్నాయి. సాలార్ జంగ్, అమ్మపల్లి బావులను భారత్ బయోటెక్ సంస్థ, అడిక్‌మెట్ మెట్ల బావిని దొడ్ల డైరీ సంస్థ, ఫలక్‌నుమా మెట్ల బావిని టీజీఆర్టీసీ సంస్థ, కోఠీలోని రెసిడెన్సీ మెట్ల బావిని ఉమెన్స్ కాలేజీ పునరుద్దరించనున్నాయి.












Click it and Unblock the Notifications