ఆసరా పింఛన్ భారీగా పెంపు- చెప్పింది చేసిన కేసీఆర్: ఆ హామీ ఇంకా బ్యాలెన్స్
హైదరాబాద్: తెలంగాణ.. అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది. దీనికి సంబంధించిన వేడి రాజుకుంటోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ఇక ఎంతో సమయం లేదు. ఈ నేపథ్యంలో అధికార భారత్ రాష్ట్ర సమితి.. ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గురి పెడుతోంది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది.
ఇందులో భాగంగా- ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త చెప్పింది. వారికి అందజేస్తోన్న పింఛన్ మొత్తాన్ని భారీగా పెంచింది. ప్రస్తుతం అందుతోన్న 3,016 పింఛన్ మొత్తానికి మరో 1,000 రూపాయలను జత చేసింది. 4,016 రూపాయలకు పెంచింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.

గతంలో మంచిర్యాల్ పర్యటన సందర్భంగా కేసీఆర్ దివ్యాంగులకు శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. ప్రతినెలా వారికి 3,016 రూపాయల మొత్తాన్ని పింఛన్‌గా అందజేస్తోన్నామని, దీన్ని మరో 1,000 రూపాయలకు పెంచుతామంటూ అప్పట్లో ప్రకటించారు. ఇకపై ప్రతి నెలా 4,016 రూపాయల పింఛన్ ఇస్తామంటూ బహిరంగ వేదిక ద్వారా హామీ ఇచ్చారు.
వృద్ధులు, వికలాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలకు ఆర్థిక చేయూతను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఆసరా పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. దీనికింద ఆయా వర్గాల వారందరికీ సామాజిక భద్రత కింద పింఛన్‌ను అందజేస్తోంది. బీడి కార్మికులకు కూడా దీన్ని వర్తింపజేసింది.
ప్రస్తుత నెల నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. ఇక దసరా బోనస్‌గా సింగరేణి క్యాలరీస్ కార్మికులకు 700 రూపాయలను మంజూరు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దసరా నాటికి బోనస్ రూపంలో ఈ మొత్తాన్ని వారికి అందజేయనుంది తెలంగాణ ప్రభుత్వం.












Click it and Unblock the Notifications