Transfers: బదిలీల జాతర షురూ! భార్యాభర్తలకు బంపర్ ఆఫర్..
తెలంగాణ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా నిలిచిపోయిన బదిలీల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో (GO) జారీ చేసింది. మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, అటు పరిపాలన సౌలభ్యం, ఇటు ఉద్యోగుల వ్యక్తిగత అవసరాలను సమన్వయం చేస్తూ ప్రభుత్వం కొత్త నిబంధనలను రూపొందించింది.
ప్రభుత్వం విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం.. 2026 జనవరి 1 నాటికి ఒకే చోట మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు బదిలీకి అర్హులు. అయితే, ఏ ఒక్క ఉద్యోగిని కూడా ఒకే చోట నాలుగేళ్లకు మించి కొనసాగించకూడదని ప్రభుత్వం కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల సుదీర్ఘకాలంగా ఒకే చోట పాతుకుపోయిన వారికి స్థానచలనం కలగనుంది.

నిబంధనలు ఇవే:
- గరిష్ట పరిమితి: ఏ క్యాడర్‌లోనైనా సరే మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 40 శాతానికి మించి బదిలీలు చేయకూడదు.
- రిటైర్మెంట్ మినహాయింపు: 2027 మే 31లోపు పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులను వారి అభ్యర్థన మేరకు మాత్రమే బదిలీ చేయాలి. ఒకవేళ వారు ప్రస్తుతమున్న చోటే కొనసాగాలనుకుంటే వారిని ఇబ్బంది పెట్టకూడదు.
స్పౌజ్ కేసులకు వెసులుబాటు: భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైన వారికి (Spouse cases) బదిలీల్లో ప్రాధాన్యత మరియు మినహాయింపులు కల్పించారు.
గతంలో ఏం జరిగింది?
తెలంగాణలో గత రెండేళ్లుగా బదిలీల ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎన్నికల కోడ్, పరిపాలనాపరమైన కారణాలు, అంతకుముందు జరిగిన '317 జీవో' గందరగోళం వల్ల బదిలీలు నిలిచిపోయాయి. దీనివల్ల వేలమంది ఉద్యోగులు తమ సొంత జిల్లాలకు లేదా అనుకూలమైన ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా భార్యాభర్తలు వేర్వేరు జిల్లాల్లో పని చేస్తూ ఎదుర్కొంటున్న సమస్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేయడంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
మే నెలంతా ట్రాన్స్‌ఫర్ల సందడి..
మే 1 నుండి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియలో అత్యంత పారదర్శకత పాటించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఆయా శాఖల వారీగా ఖాళీల వివరాలను ప్రదర్శించి, కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపట్టనున్నారు. రాజకీయ జోక్యం లేకుండా, కేవలం సీనియారిటీ మరియు నిబంధనల ప్రకారమే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.












Click it and Unblock the Notifications