కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్..: మార్పులు ఇవే
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. రేషన్ కార్డుల విషయంలో సరికొత్త నిర్ణయాలను తీసుకుంది. మున్ముందు ప్రతి కుటుంబానికీ డిజిటల్ కార్డులను జారీ చేసేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది.
రేషన్ సహా అన్ని సంక్షేమ పథకాలకూ ఉపయోగపడేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు రూపకల్పన చేస్తోంది రేవంత్ సర్కార్. ఈ సింగిల్ కార్డులో అమర్చబోయే చిప్/స్కాన్ కోడ్ ద్వారా లబ్దిదారులు చౌక డిపోల నుంచి నిత్యావసర సరుకులను తెచ్చుకోవడంతో పాటు ఆరోగ్యశ్రీ, ఇతర సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందవచ్చు.

ఈ కొత్త తరహా కార్డులు ఎలా ఉండాలనే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య, పౌర సరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజ నర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు.
కుటుంబాల్లో కొత్త సభ్యులు చేరినప్పుడు లేదా వారి పేర్లను తొలగించాల్సి వచ్చినప్పుడు కార్డును ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకునేలా ఈ వ్యవస్థను తీర్చిదిద్దాలని రేవంత్ రెడ్డి సూచించారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికపై కసరత్తు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఇప్పటికే రాజస్థాన్, హర్యానా, కర్ణాటకల్లో ఈ తరహా డిజిటల్ కార్డుల విధానం అమలులో ఉంది. ఆయా రాష్ట్రాల్లో పర్యటించి, వాటిపై అధ్యయనం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా ఫ్యామిలీ డిజిట్ కార్డుల జారీని చేపట్టాలని, అది విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని అన్నారు.

రాష్ట్రంలో గల ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణం, ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసుకోవాలని, అక్కడ వంద శాతం అంటే ప్రతి కుటుంబానికీ ఈ డిజిటల్ కార్డులను అందజేయాలని అన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఉండాలని, లబ్ధిదారులు ఎక్కడ నివసిస్తోన్నా రేషన్, ఆరోగ్య సేవలు పొందేలా చూడాలని చెప్పారు.
కుటుంబంలో ప్రతి సభ్యుడి హెల్త్ ప్రొఫైల్‌ను కూడా ఈ డిజిటల్ కార్డుల్లో పొందుపర్చాల్సి ఉంటుందని రేవంత్ స్పష్టం చేశారు. దీన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం, డాక్టర్లు ఇచ్చిన హెల్త్ రిపోర్టులను డిజిటల్ రూపంలో ఈ హెల్త్ ప్రొఫైల్‌లో పొందుపర్చేలా ఉండాలని సూచించారు.












Click it and Unblock the Notifications