మద్యం ధరల పెంపు - మందు బాటిల్ సైజుల్లోనూ మార్పు, కొత్త రేట్లు..!!
మందుబాబులకు బిగ్ అలర్ట్. మద్యం ధరలతో పాటుగా బాటిల్ సైజుల్లోనూ మార్పులు జరగనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వానికి మద్యం తయారీ కంపెనీల నుంచి పలు ప్రతిపాదనలు అందాయి. వీటి పైన ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కాగా, మద్యం ధరలు ఏ మేర పెంచాలి.. ఏ పరిమాణంలో విక్రయించాలనే అంశం పైన సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ నెల 17న జరిగే కీలక సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
తెలంగాణలో మద్యం ధరల పెంపు కు తుది కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే కంపెనీల నుంచి అందిన ప్రతిపాదనల పైన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరల కమిటీ రేపు (17వ తేదీ) సమావేశం అయి చర్చించనుంది. ధరల పైన తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ కమిటీ ఇప్పటికే మద్యం తయారీ సంస్థలు, డిస్టిలరీల ప్రతినిధులతో సమావేశం అయి వారి అభిప్రాయాలు సేకరించింది. మద్యం తయారీ కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తి వ్యయం, ముడి పదార్థాల ధరలు, రవాణా ఖర్చులు, పన్నుల ప్రభావం వంటి కారణాలతో ధరలు పెంచాలని కోరుతున్నాయి. గాజు సీసాలు, ప్యాకేజింగ్ సామగ్రి, స్పిరిట్ ధరలు, కార్మిక వ్యయాలు,రవాణా ఖర్చులు గణనీయంగా పెరిగాయని,ప్రస్తుతం అమల్లో ఉన్న ధరలతో వ్యాపారం కొనసాగించడం కష్టసాధ్యంగా మారిందని తయారీ సంస్థలు కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. కాగా.. రేపు (జూలై 17) జరిగే సమావేశంలో మద్యం ధరలను ఎంత మేర పెంచాలి, ఏయే బ్రాండ్లపై ఎంత మేర ధరల సవరణ ఉండాలి, కొత్త ధరలను ఎప్పటి నుంచి అమలు చేయాలి వంటి అంశాలపై చర్చించనున్నారు.

రేపు జరిగే సమావేశంలో తుది నిర్ణయం
అయితే.. ప్రీమియం, మిడిల్, ఎకానమీ విభాగాలకు చెందిన బ్రాండ్లకు వేర్వేరుగా ధరలు నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు మద్యం ధరలు 10-20 శాతం మేర పెంచే అవకాశం ఉంది. అదే విధంగా ధరల సవరణతో పాటు మద్యం బాటిళ్ల పరిమాణాల్లో మార్పులు తీసుకురావాలనే ప్రతిపాదన కూడా కమిటీ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బాటిళ్లతో పాటు 150 మిల్లీలీటర్ల (150 ఎంఎల్) కొత్త సైజు బాటిళ్లను ప్రవేశపెట్టాలని కొన్ని మద్యం తయారీ సంస్థలు ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. ప్రభుత్వానికి అందిన ప్రతిపాదనలకు కమిటీ ఆమోద ముద్ర వేస్తే ప్రస్తుతం విక్రయిస్తున్న బాటిళ్లతో పాటు 150 ఎంఎల్ బాటిళ్లు కూడా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఏ బ్రాండ్ కు ఎంత మేర పెంచాలనేది ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 17న జరిగే ధరల నిర్ణయ కమిటీ సమావేశం లో తీసుకొనే నిర్ణయాల ఆధారంగా ప్రభుత్వం అధికారికంగా మద్యం ధరల పైన నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications