టీఎస్‌పీఎస్సీలో 10 కీలక పోస్టులు: పరీక్షల కంట్రోలర్‌గా ఐఏఎస్ సంతోష్ నియామకం
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC)లో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. తాజాగా, శుక్రవారం టీఎస్‌పీఎస్సీలో పది కొత్త పోస్టులను మంజూరు చేసింది.
పరీక్షల కంట్రోలర్, డిప్యూటీ కంట్రోలర్, అసిస్టెంట్ కంట్రోలర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, సీనియర్, జూనియర్ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్, జూనియర్ ప్రోగ్రామర్ పోస్టులు, జూనియర్ సివిల్ జడ్జి కేడర్‌లో లా ఆఫీసర్ పోస్టులకు కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ కొత్త పోస్టులను మంజూరు చేసింది.

మరోవైపు, టీఎస్‌పీఎస్సీ అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి బీఎం సంతోష్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్ బాధ్యతల నుంచి ఆయనను బదిలీ చేసింది. దీంతో ఐఏఎస్ అధికారి సంతోష్ టీఎస్‌పీఎస్సీ పరీక్షల కంట్రోలర్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో మరో ఇద్దరి అరెస్ట్
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో తాజాగా శుక్రవారం మరో ఇద్దరు అరెస్టయ్యారు. కేసుకు సంబంధించి మహబూబ్‌నగర్‌కు చెందిన మైబయ్య, ఆయన కుమారుడు జనార్ధన్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. జనార్ధన్ కోసం డాక్యానాయక్‌కు రూ. 2 లక్షలు ఇచ్చి మైబయ్య ఏఈ పేపర్ కొన్నట్లు సిట్ అధికారులు తమ దర్యాప్తులో తేల్చారు. కాగా, వికారాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో మైబయ్య టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.
ఈ క్రమంలోనే డాక్యానాయక్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఏఈ ప్రశ్నపత్రానికి రూ. 6 లక్షలు ఇవ్వాలని మైబయ్యను డాక్యా నాయక్ కోరాడు. అయితే, రూ. లక్షల మాత్రమే ఇస్తానని మైబయ్య చెబుతూ.. ఆ డబ్బును డాక్యా నాయక్ అకౌంట్ కు బదిలీ చేశాడు. ఆ తర్వాత ఏఈ ప్రశ్నపత్రాన్ని మైబయ్యకు డాక్యా అందజేశాడు. దాన్ని మైబయ్య తన కుమారుడు జనార్ధన్‌కు ఇచ్చి పరీక్ష రాయించాడు. తాజాగా, ఈ తండ్రీకొడుకుల అరెస్టుతో లీకేజీ వ్యవహారంలో అరెస్టైన వారి సంఖ్య 19కి చేరింది.












Click it and Unblock the Notifications