3 దశల్లో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు, షెడ్యూల్ విడుదల: వివరాలు ఇవీ
హైదరాబాద్: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు మంగళవారం షెడ్యూల్ విడుదలైంది. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు.
తొలి విడత పోలింగ్ ప్రక్రియ జనవరి 7వ తేదీన ప్రారంభమై 21వ తేదీన ముగుస్తుంది. రెండ విడత పోలింగ్ ప్రక్రియ జనవరి 11వ తేదీన మొదలై 25వ తేదీన ముగుస్తుంది. మూడో విడత పోలింగ్ ప్రక్రియ 16వ తేదీన మొదలై 30వ తేదీన ముగుస్తుంది. పోలింగ్ ఈ నెల 21న, 25న, 30వ తేదీల్లో జరగనుంది. అదే రోజు ఫలితాలు ఉంటాయి.

మొదటి విడతలో 4480 గ్రామ పంచాయతీలకు, 38,983 వార్డులకు, రెండో విడతలో 4137 గ్రామపంచాయతీలకు 36,620 వార్డులకు, మూడో విడతలో 4115 గ్రామ పంచాయతీలకు, 36,718 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఏ విడతలో ఏ గ్రామ పంచాయతీకి ఎన్నిక జరుగుతుందో మూడో తేదీన ప్రకటించే అవకాశముంది.
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కోటి 49 లక్షల 52వేల 58 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నవంబర్ 19వ తేదీ వరకు ఉన్న ఓటర్లు ఓటు వేసేందుకు అర్హులు అని చెప్పారు. ఆ తర్వాత ఓటర్లు ఉంటే ప్రత్యేక జాబితా తయారు చేస్తామన్నారు. బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు ఉంటాయి.
ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,13,190 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. 19 పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ జరగడం లేదని చెప్పారు. కాగా, ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సీఎం అఫీషియల్ టూర్లు, రివ్యూలు రద్దయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.












Click it and Unblock the Notifications