తెలంగాణ టీచర్ల బదిలీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఉపాధ్యాయుల బదిలీలపై మధ్యంతర స్టే ఉత్తర్వులను సవరిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయ సంఘాల నేతలకు 10 అదనపు పాయింట్లు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అయితే, టీచర్ యూనియన్ల నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా బదిలీలకు అనుమతిచ్చింది.
ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడానికి ఉన్నత న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది. భార్యాభర్తలు కలిసి ఉండాలన్నది నిబంధన ఉద్దేశమని హైకోర్టు స్పష్టం చేసింది. టీచర్ల బదిలీలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు ఉత్తర్వులు పేర్కొంది. పిటిషనర్ల తరపు చిక్కుడు ప్రభాకర్, కృష్ణయ్య వాదనలు వినిపించారు. ఇక ప్రభుత్వం తరపున అదనపు ఏజీ రామచంద్రరావు వాదించారు.

టీఎస్ సెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష దరఖాస్తుల గడువు పొడిగించారు. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత కోసం నిర్వహించే ఈ పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 29తో ముగిసింది. అయితే, తాజాగా, సెప్టెంబర్ 4వ వరకు ఆ గడువును పొడిగించినట్లు టీఎస్ సెట్ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ మురళీకృష్ణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
తాజా, దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత కూడా దరఖాస్తు చేయాలనుకుంటే రూ. 1500 ఆలస్య రుసుంతో సెప్టెంబర్ 10 వరకు, రూ. 2వేల ఆలస్య రుసుంతో సెప్టెంబర్ 18 వరకు, రూ. 3 వేల ఆలస్య రుసుంతో సెప్టెంబర్ 24 వరకు దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఉంది. రిజిస్ట్రేషన్ ఫీజు దీనికి అదనం.
సెప్టెంబర్ 26, 27 తేదీల్లో దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. అక్టోబర్ 20 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో ఈ పరీక్ష జరగనుంది. అర్హులైన https://online.telanganaset.org/TSSET23v1/ త్వరగా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ పరీక్షకు ఆదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కర్నూలు, కరీంనగర్, ఖమ్మం, తిరుపతి, మహబూబ్‌నగర్, మెదక్, విశాఖపట్నం, నల్గొండ, రంగారెడ్డిలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.












Click it and Unblock the Notifications