తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీ
Telangana High Court Chief Justice: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే బదిలీ అయ్యారు. బోంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్లనున్నారు. ఆయనతో పాటు పలు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులు చేసింది.
ఈ మేరకు తన సిఫారసులను కేంద్ర న్యాయ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపించింది. చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే బదిలీపై వెళ్లిన తరువాత జస్టిస్ సుజయ్ పాల్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను స్వీకరిస్తారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు లేదా సుప్రీంకోర్టు మరొకరి పేరును సిఫారసు చేసేంత వరకూ ఆయనే ఈ హోదాలో కొనసాగుతారు.

ప్రస్తుతం జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ బోంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తోన్నారు. ఆయనను ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అపాయింట్ చేయాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. దేవేంద్ర ఉపాధ్యాయ అలహాబాద్ హైకోర్టుకు చెందిన న్యాయమూర్తి.
2009లో మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు జస్టిస్ అలోక్ అరాధే. ఆ తరువాత రెండు సంవత్సరాలకు అంటే 2011లో శాశ్వత న్యాయమూర్తిగా అపాయింట్ పొందారు. 2016లో జమ్మూ కాశ్మీర్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. మూడు నెలల పాటు అక్కడ కొనసాగారు.
అనంతరం 2018 నవంబర్ 17వ తేదీన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2022లో కొన్ని నెలల పాటు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. 2023లో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.
పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కే వినోద్ చంద్రన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 2023 మార్చి 29వ తేదీన ఆయన చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలను స్వీకరించారు. ఆయన రాకతో సుప్రీంకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరుకుంటుంది.
34 మంది వరకు న్యాయమూర్తులను నియమించుకునే అవకాశం ఉంది సుప్రీంకోర్టుకు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీటీ రవికుమార్ ఈ నెల 3వ తేదీన పదవీ విరమణ చేయడంతో ఈ సంఖ్య 32కు పడిపోయింది. దీనితో ఆ స్థానాన్ని జస్టిస్ కే వినోద్ చంద్రన్‌తో భర్తీ చేయాలని కొలీజియం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications