కరోనా పరీక్షలు ఎలా నిలిపేస్తారు? బులిటెన్లలో వివరాలేవీ?: హైకోర్టు ఆగ్రహం, ఆన్‌లైన్ క్లాసులపైనా..
హైదరాబాద్: కరోనా పరీక్షలు నిలిపివేయడంపై తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలు నిలిపివేస్తూ ప్రజారోగ్య డైరెక్టర్ ఉత్తర్వులు ఇవ్వడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని వ్యాఖ్యానించింది. ఐసీఎంఆర్ నిబంధనలకు విరుద్ధంగా పీహెచ్ డైరెక్టర్ ఉత్తర్వులున్నాయని అభిప్రాయపడింది.

కరోనా పరీక్షల వివరాలేవీ?
అంతేగాక, రాష్ట్రంలో కరోనా పరీక్షలు, మీడియా బులిటెన్‌లో అరకొర సమాచారం ఇస్తుండటంపై హైకోర్టు మరోసారి తెలంగాణ సర్కారుపై మండిపడింది. తమ ఆదేశాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియా బులిటెన్‌లో వార్డులవారీగా కీలక సమాచారం ఉండాలన్న ఆదేశాలు అమలు కావడం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కంటైన్మెంట్ విధానమెంటో తెలపాలని, కంటైన్మెంట్ ప్రాంతాల వివరాలు సమర్పించాలని పేర్కొంది. గత 20 రోజులుగా జరిపిన కరోనా పరీక్షల వివరాలు తెలపాలని ఆదేశించింది.

తెలంగాణ సర్కారుకు హెచ్చరిక
అంతేగాక, కేంద్ర బృందం పరిశీలనలో తేలిన అంశాలను సమర్పించాలని స్పష్టం చేసింది. జులై 17లోగా న్యాయస్థానం ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాలని తేల్చి చెప్పింది. ఒకవేళ అమలు కాకపోతే జులై 20న సీఎస్, వైద్యారోగ్య, మున్సిపల్ ముఖ్య కార్యదర్శులు, జీహెచ్ఎంసీ కమిషనర్ కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని ఉన్న త న్యాయస్థానం హెచ్చరించింది.

ఆన్‌లైన్ క్లాసులకు ఇష్టానుసారం ఫీజులు
ఇక లాక్‌డౌన్ కారణంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆన్‌లైన్ తరగతుల వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌పైనా హైకోర్టు బుధవారం విచారించింది. లాక్‌డౌన్ సమయంలోనూ ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నారని, ప్రైవేటు స్కూళ్ల దోపిడీని అరికట్టాలని పేరెంట్స్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గంటల తరబడి ఆన్‌లైన్ క్లాసుల వల్ల పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రుల అసోసియేషన్ హైకోర్టుకు వివరించింది. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభం కాకపోయినా ఫీజులు ఇష్టానుసారం వసూలు చేస్తున్నారని కోర్టుకు తెలిపింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను ఉల్లంఘించి పాఠశాలలు ఫీజులు వసూలు చేస్తున్నాయని తల్లిదండ్రుల అసోసియేషన్ కోర్టుకు వివరించింది. దీనికి ఆధారాలుగా స్కూళ్లు తల్లిదండ్రులకు పంపిన సందేశాలను, ఫోన్ కాల్ రికార్డులను కోర్టు ముందు ఉంచింది.

ఆన్‌లైన్ క్లాసుల విషయంలో సర్కారు ఏం చేస్తోంది?
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణపై ప్రభుత్వం ఏదైనా జీవో జారీ చేసిందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వం ఆన్ లైన్ క్లాసులపై ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకుందని నిలదీసింది. అడ్వొకేట్ జనరల్ స్పందిస్తూ.. జిల్లా విద్యాశాఖ అధికారులు దీనిపై పరిశీలిస్తున్నారని తెలిపారు. అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆన్‌లైన్ క్లాసులపై ఎలాంటి మార్గదర్శకాలు పాటిస్తున్నారో కోర్టుకు తెలపాలని హైకోర్టు ఆదేశించింది. ఆన్ లైన్ క్లాసులు ఉంటాయా? ఉండవా? అనేదానిపై ప్రభుత్వ నిర్ణయం కోర్టుకు స్పష్టం చేయాలని ఆదేశించింది. హర్యానాలో ఇప్పటికే ఆన్ లైన్ క్లాసులను నిషేధించారని గుర్తు చేసింది. పంజాబ్, హర్యానాలో విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావద్దని అక్కడి ప్రభుత్వాలు స్కూళ్లకు ఆదేశాలు ఇచ్చాయని తెలిపింది. తెలంగాణలో ఆన్ లైన్ క్లాసుల నిర్వహణఫై యూనిఫాం పాలీ తీసుకురావాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications