గీజరు అక్కర్లేని తెలంగాణా గ్రామాలు.. పంపుల్లో ఉబికొచ్చే సహజ వేడినీళ్ళు!
సహజంగా మనకు వేడి నీళ్ళు కావాలంటే హీటర్లు, గీజర్ లు లేదా స్టవ్ మీద వేడి నీళ్ళు కాచుకుని స్నానం చేస్తాం. కానీ తెలంగాణాలోని కొన్ని గ్రామాలలో బోర్లు, పంపులు, కాలువలలో నేచురల్ గానే వేడి నీళ్ళు వస్తాయి. అక్కడ గ్రామస్తులకు నీళ్ళు కాచుకునే పని ఉండదు. హీటర్లు, గీజర్ల అవసరం ఉండదు. ఏడాది పొడవునా వాళ్లకు వేడి నీళ్ళు అందుతాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని పగిడేరు, గొల్లకొత్తూరు గ్రామాల్లో గీజరు అవసరం లేదు. భూమి నుంచి సహజంగా వేడినీరు ఉబికి వస్తోంది. పంపులు, బోర్లు, కాలువల్లో ఏడాది పొడవునా ఇలాంటి వేడినీరు ప్రవహిస్తుంటుంది. వర్షం పడిన తర్వాత లేదా చలికాలం ఉదయాల్లో నేలంతా ఆవిరి కమ్ముకుంటుంది. తెల్లటి పొగలా కనిపించే ఈ దృశ్యం స్థానికులకు పెద్ద ఆశ్చర్యంగా అనిపించదు. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఎప్పుడూ అలాగే ఉంటుంది.

గ్రామస్థులు ఈ నీటిని స్నానానికి, ఇంటి అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. మూడు ప్రధాన ప్రాంతాల్లో ఇలా వేడినీరు బయటకు వస్తోంది. కారణం భూమి లోపలి బొగ్గు గనుల నుంచి వెలువడే వేడి. సింగరేణి కాలరీస్ ప్రాంతంలో ఈ భూగర్భ వేడి కారణంగా నీరు వేడెక్కి పైకి వస్తోంది. దాదాపు వెయ్యి మీటర్ల లోతు నుంచి 65 నుంచి 80 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో నీరు ఉబికుతుందని అధికారిక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
ఇదే ప్రాంతంలో ఖమ్మంతోగు, బుగ్గ వంటి సమీప గ్రామాల్లో కూడా ఇలాంటి వేడినీటి బుగ్గలు ఉన్నట్లు స్థానికులు, అనేక పాత నివేదికలు చెబుతున్నాయి. సింగరేణి ఇతర ప్రధాన ఏరియాలైన రామగుండం, బెల్లంపల్లి, మందమర్రి వంటి చోట్ల ఇలా సహజంగా వేడినీరు పంపుల్లో రావడం నమోదు కాలేదు. మణుగూరు ప్రాంతం గోదావరి లోయ బొగ్గు బెల్ట్‌లోని ప్రత్యేక భూగర్భ పరిస్థితుల కారణంగా ఈ జియోథర్మల్ లక్షణం కనిపిస్తోంది.
స్థానికులు దశాబ్దాలుగా ఈ సహజ వేడినీటిని ఉచితంగా వినియోగిస్తూ ఉన్నారు. తెలంగాణ బొగ్గు ప్రాంతాల్లో ఇలాంటి అరుదైన భూగర్భ వైవిధ్యం పగిడేరు పరిసరాలకే పరిమితమై ఉందని తెలుస్తుంది. మొత్తంగా ఆ గ్రామాలకు వెళ్తే ఎక్కడ చూసినా వేడి నీళ్ళు , భూమి లో నుండి పైకి ఆవిర్లు కనిపిస్తాయి.













Click it and Unblock the Notifications
