తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్: పరీక్ష ఫీజు గడువు 21 వరకు పొడిగింపు
హైదరాబాద్: ఇంటర్ బోర్డ్ తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు శుభవార్త అందించింది. ఇంటర్ పరీక్షలకు సంబంధించిన పరీక్షల ఫీజు గడువును ఏప్రిల్ 21వరకూ పొడిగించింది. ఏప్రిల్ 21 వరకూ 5వేల రూపాయల అపరాధ రుసుముతో దరఖాస్తులు చేసుకోవచ్చు. గతంలో తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలను ముందుగానే ప్రకటించింది.
ఆ తర్వాత జేఈఈ పరీక్షల తేదీలు వచ్చాయి. దీంతో తెలంగాణ ఇంటర్ పరీక్ష తేదీలతో క్లాష్ కావడంతో తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్ష తేదీలను సవరించింది. తెలంగాణ ఇంటర్ బోర్డు తెలిపిన వివరాల ప్రకారం.. మే 6 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతాయి. మే 7, 10, 13, 14, 17, 19, 21, 24 తేదీలలో ఇంటర్ సెకండియర్, మే 6, 9, 11, 13, 16, 18, 20, 23 తేదీల్లో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించనుంది.

కాగా, ఇంటర్ విద్యార్ధులు మానసిక ఒత్తిడికి గురి కాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఇంటర్ బోర్డు సూచించింది. అందుకు అనుగుణంగా ఇంటర్ బోర్డు సైకాలజిస్టుల్ని నియమించింది. కరోనా కారణంగా ఆన్ లైన్ క్లాసులు బాగా నడిచాయి. దీంతో అధ్యాపకులతో ఇంటరాక్షన్ లేక ఒత్తిడికి గురయ్యారు విద్యార్థులు.
త్వరలో పరీక్షలు ప్రారంభం కానున్న వేళ విద్యార్థుల సమస్యను దృష్టిలో పెట్టుకొని వారికి సైకాలజిస్టు సహాయాన్ని అందించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ తెలిపారు. పరీక్షల సమయంలో ఆందోళన చెందే విద్యార్థులు వారి సమస్యలను ఫోన్ ద్వారా సైకాలజిస్టులకు చెప్పుకోవచ్చు. ఇందుకోసం సైకాలజిస్టు ప్యానల్‌ను బోర్డు ఏర్పాటు చేసింది.












Click it and Unblock the Notifications