Red Alert: తెలంగాణలో వచ్చే రెండు రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు..!
తెలంగాణలో వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. శుక్ర, శనివారాల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం నాటికి తెలంగాణలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆ శాఖ శుక్రవారం, శనివారాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆదివారం కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
గురువారం కూడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం నుంచి సెప్టెంబర్ 2 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. హైదరాబాద్‌లో సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. శుక్రవారం నుంచి సెప్టెంబరు 1 వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్థాయని అంచనా వేసింది. అక్కడడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కూడా పడే అవకాశం ఉందని వివరించింది.

రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. శుక్ర, శనివారాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ప్రస్తుత నైరుతి రుతుపవనాల సమయంలో తెలంగాణ సగటు వర్షపాతం 627.6 మి.మీ కాగా ఇప్పటి వరకు 558.6 మి.మీ వర్షపాతం నమోదయింది. హైదరాబాద్‌లో సాధారణ వర్షపాతం 450 మిల్లీమీటర్ల కాగా.. ఇప్పటి వరకు 511.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. అటు ఏపీలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications