విశ్వాసం నింపాల్సిన చోట.. విద్వేషపు మాటలు : మోదీపై కేటీఆర్ ఫైర్
దేశంలో అమలవుతోంది అంబేడ్కర్ రాజ్యాంగం కాదు.. మోదీ రాజ్యంగం అని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ నోటికి ఇష్టం వచ్చినట్లు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు . ప్రజల్లో విశ్వాసాన్ని నింపాల్సిన చోట.. విద్వేషపు మాటలు మాట్లాడరని దుయ్యబట్టారు. తెలంగాణను అవమానించేలా చేసిన వ్యాఖ్యలకు మోదీ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

తెలంగాణ జాతిని కించపరిచేలా మోదీ వ్యాఖ్యలు
దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్న తెలంగాణ అభివృద్ధిని చూసి ప్రధాని మోదీ, బీజేపీ నేతల కడుపు మండుతోందని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్రం కంటే తెలంగాణ ముందుకు వెళ్తోందనే బాధ వారిలో ఉన్నట్లుందన్నారు. అందుకే పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్రం గురించి అసందర్భంగా మాట్లాడారని మండిపడ్డారు. కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని దుయ్యబట్టారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా... తెలంగాణ జాతిని కించపరిచేలా మోదీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

మోదీ ప్రసంగం ప్రజలను రెచ్చగొట్టేలా..
హైదరాబాద్ శివార్లలోని ఆదిభట్ల మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. పార్లమెంటులో మోదీ ప్రసంగం ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. తల్లిని చంపి బిడ్డనిచ్చారన్నారు. ఇలాంటి మాటలు ఇప్పుడెందుకు మాట్లాడాల్సి వచ్చిందని నిలదీశారు. దేశ ప్రధానిగా ఇంత దారుణంగా,అన్యాయంగా, అసందర్భంగా, ఇష్టారీతిన మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని, తెలంగాణ కోసం దశాబ్దాల పోరాటాన్ని, అమరుల త్యాగాలను మోదీ కించపరిచినట్లేనని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video

ప్రేమను పంచాలి.. కానీ గుండెల్లో గునపాలు కాదు..
ప్రధాని మోదీ ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణకు పారిశ్రామిక రాయతీలు, కోచ్ ఫ్యాక్టరీ , పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. టెక్స్ టైల్స్ పార్కుకి కానీ, ఫార్మసిటీకి కానీ పైసా సాయం చేయలేదని మండిపడ్డారు. కొత్త రాష్ట్రానికి గుండెల నిండా ప్రేమను పంచాలి.. కానీ గుండెల్లో గునపాలు దించేలా మోదీ మాట్లాడారని ద్వజమెత్తారు . 50 ఏళ్ల తెలంగాణ పోరాటాన్ని, అమరుల త్యాగాలను అవమానించేలా చేసిన వ్యాఖ్యలకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications