ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని.. తెలంగాణా జాగృతి సంచలన లేఖ!!
కామారెడ్డి జిల్లా ఎస్పీ కి తెలంగాణ జాగృతి సంచలన లేఖ రాసింది. కామారెడ్డి జిల్లా తెలంగాణ జాగృతి అధ్యక్షులు చిట్టిమల్లు అనంత రాములు ఎస్పి కి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దంటూ లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ కామారెడ్డి జిల్లా ఎస్పీ కి తెలంగాణ జాగృతి రాసిన లేఖ ఆంతర్యమేమిటంటే..

రోడ్లపై రహస్య స్పీడ్ కెమెరాలపై తెలంగాణా జాగృతి లేఖ
రోడ్లపై పోలీసులు పెడుతున్న స్పీడ్ కెమెరాలను ఉద్దేశించి తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా ఎస్పీ కి లేఖ రాసింది. ఈ లేఖలో రోడ్లపై పోలీసులు స్పీడ్ కెమెరాలు పొదలమాటున ఏర్పాటు చేస్తూ వచ్చిపోయే వాహనాలకు కెమెరాలతో ఫోటోలు తీస్తూ, వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని చిట్టిమల్ల అనంత రాములు తమ లేఖ ద్వారా పేర్కొన్నారు. వాహనాలు వేగంగా వెళ్లకపోయినప్పటికీ కెమెరాలతో ఫోటోలు తీస్తూ ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నారని లేఖ ద్వారా ఆరోపించారు.

ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు అంటూ లేఖలో విజ్ఞాపన
రోడ్లపై స్పీడ్ లిమిట్ బోర్డులు పెట్టి, కెమెరాలను పొదల చాటున కాకుండా రోడ్లపై వచ్చిపోయే వాహనదారులకు కనిపించే విధంగా పెడితే, ప్రజలు కూడా గమనించి స్పీడ్ లిమిట్ ను పాటిస్తారని ఆ లేఖలో పేర్కొన్నారు. తద్వారా ప్రమాదాలు కూడా తగ్గుతాయి అంటూ లేఖలో స్పష్టం చేశారు. అలా కాకుండా రహస్య కెమెరాలతో ప్రజలను ఇబ్బంది పెడితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని లేఖ ద్వారా స్పష్టం చేశారు.తాము చెప్పిన విధానంలో కాకుండా రహస్య కెమెరాలను పెట్టి ప్రజలను వేధింపులకు గురి చేయడం సరైంది కాదని కామారెడ్డి తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు పేర్కొన్నారు.

కెమెరాలు కనిపించే విధంగా పెట్టాలని ఎస్పీకి విజ్ఞప్తి
కచ్చితంగా రోడ్లపై స్పీడ్ లిమిట్ బోర్డులను ఏర్పాటు చేయాలని, కెమెరాలను రోడ్డు పక్కన కనిపించే విధంగా అమర్చాలని తాము విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొన్నారు. కాబట్టి దయచేసి ఈ విషయంపై, వారు స్పందించడమే కాకుండా పై అధికారులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయాలని తగిన చర్యలు చేపట్టాలని తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు లేఖ రాశారు. అంతేకాదు ఆ లేఖను సీఎంవో కార్యాలయం హైదరాబాద్ కు, హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కు కూడా పంపుతున్నట్టు పేర్కొన్నారు. ట్రాఫిక్ నియమాలను పాటించని వారికి, సీక్రెట్ కెమెరా ల ద్వారా ఫోటోలు తీసి ఫైన్ లు వేస్తున్న పోలీసు వ్యవస్థ తీరు పైన తెలంగాణ జాగృతి లేఖ రాయడం సంచలనంగా మారింది. ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

సీక్రెట్ కెమెరా ల విషయంలో వాహనదారుల అసహనం.. అదే విషయాన్ని ప్రస్తావించిన జాగృతి
తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనల పేరుతో పెద్ద ఎత్తున బాదుడు కొనసాగిస్తున్నారని ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాహనంపై ఇద్దరే వెళుతున్నా ట్రిపుల్ డ్రైవింగ్ అంటూ చలాన్లు వేస్తున్నారని, వేగంగా వెళ్లకున్నా సీక్రెట్ కెమెరాలు పెట్టి ఓవర్ స్పీడ్ పేరుతో ఫైన్ వేస్తున్నారని పెద్ద ఎత్తున వాహనదారులు నుండి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే సమయంలో సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత అధ్యక్షురాలిగా ఉన్న తెలంగాణ జాగృతి కూడా రహస్య కెమెరాలు విషయంలో పోలీస్ అధికారులకు లేఖ రాయడం ఆసక్తిగా మారింది.












Click it and Unblock the Notifications