జాగృతిలో జోరు పెంచిన కవిత.. రంగం సిద్ధం! (వీడియో)
Kavitha: తెలంగాణ జాగృతిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతపరుస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. కొత్తగూడెంలో నిర్వహించిన తెలంగాణ జాగృతి సమావేశంలో ఆమె ప్రసగించారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి వీరన్నతో పాటు ఆయన అనుచరులు తెలంగాణ జాగృతిలో చేరారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కనీసం జై తెలంగాణ అనడం లేదని అన్నారు. రాష్ట్రంలో పాలన ఎలా ఉందో చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ రైతు రుణమాఫీ కాలేదని.. రేవంత్ రెడ్డిని చర్చకు రమ్మంటే పారిపోయాడని విమర్శించారు. చర్చకు వస్తానని రేవంత్ రెడ్డి పారిపోతున్నాడన్నారు.
ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇస్తామని రేవంత్ రెడ్డి మాట తప్పాడని.. సింగరేణిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు రావడం లేదన్నారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేస్తామని అంటే చూస్తూ ఊరుకోమన్నారు. రేవంత్ రెడ్డికి అవినీతి చక్రవర్తి, అసమర్థ ముఖ్యమంత్రి అనే బిరుదు ఇచ్చామన్నారు. మహిళల పక్షాన జాగృతి పోరాటం చేస్తుందన్నారు.

ఆ గ్రామాలను తెలంగాణలో కలిపేందుకు చొరవ చూపాలి..
కొత్తగూడెం జిల్లా అంటే పరిశ్రమలు ఉండే జిల్లా అని.. ఐటీసీలో కాలుష్యం లేకుండా పరిశ్రమ యాజమాన్యం దృష్టి సారించాలని సూచించారు. స్పాంజ్ ఐరన్ కర్మాగారాన్ని పునరుద్ధరణ చేయాలన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారని.. కానీ భద్రాచలం చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామ పంచాయతీలు ఆందోళనలో ఉన్నాయని విమర్శించారు. భద్రాచలం రాముడి భూములు పురుషోత్తపట్నంలో ఉన్నాయన్నారు. ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలిపేందుకు తుమ్మల చొరవ తీసుకోవాలన్నారు.
ఈవోపై దాడిని ఖండిస్తున్నాం..
జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు తుమ్మల ఐదు గ్రామ పంచాయతీలపై లెటర్ ఇచ్చారని.. పురుషోత్తపట్నంలో ఉన్న రాముడి భూములను చూడటానికి వెళ్లిన రామాలయం టెంపుల్ ఈవోపై దాడి చేశారని కవిత చెప్పారు. భద్రాచల రాముడు తెలంగాణ దేవుడని అన్నారు. సీతారామ ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వంలో 70 శాతం పూర్తి చేశామని.. మిగతా పనులు పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలన్నారు. తెలంగాణ ఆడబిడ్డ, బీసీ బిడ్డ భద్రాచలం రామాలయం ఈవో రమాదేవిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు.
సీఎం చంద్రబాబుకు కవిత లేఖ
ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణకు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశామని కవిత చెప్పారు. తెలంగాణలో బీసీలకు లోకల్ బాడీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని.. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు పెడితే చూస్తూ ఊరుకోమన్నారు. బీసీలకు లోకల్ బాడీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని జూలై 17వ తేదీన రైల్ రోకో నిర్వహిస్తున్నామని.. రైల్ రోకోను కొత్తగూడెం జిల్లాలో ఉన్న బీసీలు జయప్రదం చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు.












Click it and Unblock the Notifications