Junior doctor strike: ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు మాస్ వార్నింగ్..!
ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లు వారికొచ్చిన సమస్యలతో రోడ్డెక్కారు. తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆర్యోగ్య సేవలకు బ్రేక్ పడింది. జూనియర్ డాక్టర్లు సమ్మెకు పిలుపునివ్వడంతో వరుసగా రెండో రోజు సేవలు నిలిచిపోయాయి. దీంతో ఆస్పత్రులకు వచ్చిన పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు.సోమవారం నిరవధిక సమ్మెకు జూడాలు పిలుపునివ్వడంతో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. అయితే చర్చలు విఫలమవడంతో జూనియర్ డాక్టర్లు వారి సమ్మెను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.
జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగడంతో రోగులు ఇబ్బందిపడుతున్నారు.అయితే ఇప్పటి వరకు తాము ప్రభుత్వం ముందించిన డిమాండ్లకు పరిష్కారం ఏది చూపలేదని జూడాలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్శింహతో జరిగిన చర్చలు విఫలం కావడంతో జూడాలు తమ సమ్మెను కొనసాగిస్తున్నారు.మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో తమ సేవలను నిలిపివేస్తున్నట్లు జూడాలు పేర్కొన్నారు. డీఎంఈతో జరిగిన చర్చలు కూడా ఫలించలేదని చెప్పారు.

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సరైన హాస్టల్ వసతులు కల్పించాలని, అదేసమయంలో ప్రభుత్వ హాస్పిటల్స్‌లో భద్రతను పెంచాలన్న డిమాండ్ పై ప్రభుత్వం స్పందించలేదని జూనియర్ డాక్టర్లు చెప్పారు.అందుకే తమ సమ్మెను కొనసాగిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు చెప్పుకొచ్చారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని జూడాలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇక దీర్ఘకాలంగా పెండింగ్‌లో కొన్ని అంశాలున్నాయని ఈ సందర్భంగా జూడాలు గుర్తుచేశారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లకు సరైన భద్రత కల్పించాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉందని దాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జూనియర్ డాక్టర్లు తలపెట్టిన సమ్మెతో సిబ్బంది కొరత ఏర్పడటంతో ప్రభుత్వ హాస్పిటల్స్ యాజమాన్యం హెల్త్ కేర్ వర్కర్లకు సెలవులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరో వైపు పాఠాలు బోధిస్తున్న సీనియర్ డాక్టర్లను వెంటనే క్లినికల్ వైపు వచ్చి అక్కడ రోగులకు సేవలందించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే జూడాలు తమ సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయనేది ప్రశ్నార్థంగా మారింది. భవిష్యత్తులో ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపివేస్తామని జూడాలు హెచ్చరిస్తున్నారు. సోమవారం రోజున కేవలం ఔట్ పేషెంట్ సేవలు మాత్రమే నిలిపివేస్తూ జూడాలు నిర్ణయం తీసుకున్నారు.
ఇక గాంధీ హాస్పిటల్, ఉస్మానియా మెడికల్ కాలేజీ, కోటీలోని ENT హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్‌లో జూడాల సమ్మె కారణంగా దాదాపుగా 200 సర్జరీలు వాయిదా పడ్డాయి. ఏది ఏకమైనప్పటికీ జూనియర్ డాక్టర్ల సమ్మెతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు అభ్యర్థిస్తున్నారు.












Click it and Unblock the Notifications