అబద్ధాలకు బాద్ షా అంటూ అమిత్ షాపై నిప్పులు చెరిగిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్: కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్. తెలంగాణ ఆత్మగౌరవం, ఇక్కడి ప్రజల ఆకాంక్షలు.. ఢిల్లీ బాదూషాలు ఎన్నటికీ అర్థం చేసుకోలేరన్న విషయం.. మునుగోడులో అమిత్ షా ప్రసంగంతో తేలిపోయిందన్నారు. అమిత్ సాతో మునుగోడు ప్రజలకు పావలా ప్రయోజనం లేదన్నారు.
నల్ల చట్టాలతో రైతుల ఉసురు తీద్దామనుకున్న బీజేపీ నేతలు.. రైతు పక్షపాతి అయిన కేసీఆర్ ను విమర్శించడాన్ని చూసి హిపోక్రసీ కూడా ఆత్మహత్య చేసుకుంటుందని కేటీఆర్ ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం విద్యుత్ చట్టంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే కుట్రలకు తెరతీసిందని ఆరోపించారు. కేసీఆర్ వేసిన ప్రశ్నలకు.. జవాబు చెప్పకుండా అమిత్ షా దాటవేశారని కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ రైతుబంధు పథకాన్ని పేరు మార్చి పీఎం కిసాన్‌గా అమలు చేస్తున్నారని చెప్పారు. దేశాన్ని ఏలుతున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అమిత్ షా నుంచి అనేక అంశాలపై తెలంగాణ ప్రజలు స్పష్టతను ఆశించారని.. అయితే బీజేపీకి అలవాటైన తప్పించుకునే ధోరణినే ఆయన కొనసాగించారని కేటీఆర్ విమర్శించారు. దేశ వ్యవసాయరంగానికి నూతన దిక్సూచిగా అనేక విప్లవాత్మకమైన పథకాలను అమలుచేస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు రైతు వ్యతిరేకి అని అమిత్ షా మాట్లాడడం ఆయన అవగాహన రాహిత్యానికి, కళ్లుండి చూడలేని కబోదితనానికి నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు.

ఒకప్పుడు కరువు సీమగా ఉన్న ప్రాంతాలన్నీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పచ్చని పంటలతో సస్య శ్యామలం అయ్యాయని కేటీఆర్ చెప్పారు. వడివడిగా ప్రాజెక్టులను కట్టి తెలంగాణను జలభాండాగారంగా మార్చడంతో పాటు రైతులకు ఇచ్చిన అనేక ప్రోత్సాహక పథకాలతో నేడు రాష్ట్రంలో అద్భుతమైన వ్యవసాయ ప్రగతి కొనసాగుతుందన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని రోజుకో కేంద్ర ప్రభుత్వ సంస్థే ప్రశంసిస్తున్న సంగతి అమిత్ షాకి తెలియకపోవడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు కేటీఆర్.
ఫసల్ బీమా యోజనలో తెలంగాణ ఎందుకు చేరలేదని ప్రశ్నించిన అమిత్ షా.. ఆ పథకం నుంచి గుజరాత్ ఎందుకు వైదొలిగిందో మునుగోడులో చెప్తే బాగుండేదని కేటీఆర్ అన్నారు. కార్పోరేట్ కంపెనీలకు దేశ సంపదను దోచిపెట్టడమే జీవిత లక్ష్యంగా పనిచేస్తున్న మోడీ తీసుకొచ్చిన ఫసల్ బీమాతో ఇన్యూరెన్స్ కంపెనీలకే ప్రయోజనం తప్ప రైతులకు కాదని కేటీఆర్ ఆరోపించారు. గత 5 సంవత్సరాల్లో సుమారు 40వేల కోట్ల రూపాయాల లాభాన్ని ఈ పథకం ద్వారా ఆయా కంపెనీలు ఆర్జించిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని అర్ధం చేసుకుని ఆ పథకం నుంచి గుజరాత్ రాష్ట్రం వైదొలిగిందన్నారు. గుజరాత్ రాష్ట్రానికి పనికిరాని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తెలంగాణ రాష్ట్రానికి ఎలా పనికొస్తుందో అమిత్ షా చెప్తే తెలంగాణ ప్రజలు వినే తరించే వారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
వేల కోట్ల కాంట్రాక్టులతో ఒక ఎమ్మెల్యేను కొన్న బీజేపీ పార్టీ.. మునుగోడు నియోజకవర్గానికి ప్రత్యేకంగా కోట్లాది రూపాయల ప్యాకేజీ ప్రకటిస్తుందని అంతా ఆశించారన్నారు కేటీఆర్. గోల్ మాల్ గుజరాత్‌కు తప్ప గోల్డ్ మోడల్ తెలంగాణకు రూపాయి ఇచ్చే సంస్కారం ఆ పార్టీకి లేదన్నారు. అమిత్ షా లాంటి నాయకులు తెలంగాణ గడ్డమీద అసత్యాలతో ప్రచారం చేసినా ఇక్కడి ప్రజలు నమ్మరన్న కేటీఆర్.. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి అండగా నిలబడే టీఆర్ఎస్ పార్టీకే మద్దతుగా ఉంటారన్న విషయం మునుగోడు ఎన్నికతో బీజేపీ నేతలకు అర్థం అవుతుందన్నారు.

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గుజరాత్ రాజకీయ వ్యాపారుల ముందు తాకట్టు పెట్టిన గల్లీ నాయకులను చరిత్ర క్షమించదన్నారు. 'ఆత్మాభిమానంలేని కొందరు తొత్తులు.. మీ చెప్పులు మోయొచ్చుగానీ.. తెలంగాణను చెప్పు చేతల్లో పెట్టుకోవాలని మీరు చేస్తున్న కుట్రలకు.. ఆత్మగౌరవం వున్న తెలంగాణ జాతి ఎప్పుడూ లొంగదనే విషయాన్ని గుర్తుంచుకోండి' అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కిలో దొడ్డు బియ్యాన్ని కొంటామంటున్న అమిత్ షా.. ఇప్పుడు అధికారంలో ఉన్నది తమ పార్టీనే అన్న విషయాన్ని మర్చిపోయారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రయోజనం లేదన్న ఒకే ఒక్క కారణంతో కావాలనే తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనకుండా ఇక్కడి రైతాంగాన్ని గోస పెట్టుకుంటున్న బీజేపీ నేతల మాటలను ఎవరూ నమ్మరన్నారు కేటీఆర్. 'తెలంగాణ కర్షకుడి మీద కక్షగట్టింది నిజం కాదా..? మోటర్లకు మీటర్లు పెట్టి .. ఉచిత కరెంట్‌ను కబళించే కుట్రలు చేస్తున్నది మీరు కాదా..? కృష్ణా జలాల్లో వాటాలు తేల్చకుండా నికృష్ణ రాజకీయం చేస్తున్నది మీరు కాదా..? నీళ్లిచ్చే ప్రాజెక్టులను నిలిపివేయడానికి బోర్డులు బెట్టి బోడిపెత్తనం చేస్తున్నది మీరు కాదా..?' అని కేటీఆర్ నిలదీశారు.












Click it and Unblock the Notifications