మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్: మహమ్మారి బారినపడి ఇద్దరు అధికారుల మృతి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యులతోపాటు ప్రముఖులు కూడా కరోనా బారినపడుతున్నారు. తాజాగా, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా సోకింది. రెండు రోజులుగా ఆయనకు దగ్గు, స్వల్ప జ్వరం ఉండటంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు.
నిరంజన్ రెడ్డికి కరోనా సోకిందని పరీక్షల్లో తేలింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్‌లోని మంత్రుల క్వార్టర్స్‌లోని తన నివాసంలో నిరంజన్ రెడ్డి హోంక్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయనకు స్వల్ప జ్వరం ఉన్నట్లు సన్నిహితులు తెలిపారు.

కాగా, మూడు రోజుల క్రితం వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డికి కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. వ్యవసాయ కమిషనరేట్‌లోని పేషీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు, కొందరు వ్యవసాయ అధికారులు కూడా కరోనా బారినపడ్డారు. ఆయిల్ ఫెడ్, మార్క్ ఫెడ్ తదితర వ్యవసాయ అనుబంధ విభాగాల్లోనూ కొందరు ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో వారితో ఇటీవల సన్నిహితంగా ఉన్నవారు ఆందోళనకు గురవుతున్నారు. వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇది ఇలావుండగా, ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు అటవీశాఖ అధికారులు కరోనాతో మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. భీంపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ ఈశ్వర్(50) ఆదిలాబాద్ సెక్షన్ అధికారిగా విధులు నిర్వహిస్తుండగా, జాదవ్ సునీల్(36) నేరడిగొండలో బీట్ ఆఫీసర్‌గా ఉన్నారు. వీరిద్దరికి కొన్ని రోజుల క్రితం కరోనా సోకింది.
అప్పట్నుంచి వీరిద్దరు ఆదిలాబాద్ రిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారు. చికిత్స పొందుతూ ఇద్దరు మంగళవారం ప్రాణాలు కోల్పోయారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు అధికారులు ఒక్కరోజే మరణించడంతో భీంపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అంత్యక్రియల నిమిత్తం మృతదేహాలను రిమ్స్ నుంచి బీంపూర్ కు తరలించారు.
కాగా, గత 24 గంటల్లో తెలంగాణలో 1,13,007 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3052 మందికి కరోనా సోకినట్లు తేలింది. కరోనాతో ఏడుగురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 1772కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 406 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 24,431 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.












Click it and Unblock the Notifications