జాతరకొచ్చి రాజకీయాలా; మోడీ తెలంగాణాను అవమానిస్తే నోరువిప్పని సన్నాసులు: మంత్రుల ధ్వజం
మేడారం మహా జాతరకు వచ్చి కూడా బిజెపి నాయకులు రాజకీయాలు చేస్తారా అంటూ టిఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రశ్నించారు. పవిత్రమైన గిరిజన జాతర మేడారంలో బీజేపీ నేతలు రాజకీయాలు మాట్లాడారని బిజెపి వైఖరి కారణంగా విధిలేక మేడారం జాతరలోనూ రాజకీయాలు మాట్లాడాల్సి వస్తుందని,ఇది దురదృష్టకరమని మంత్రులు పేర్కొన్నారు. ఈ మేరకు వారు మేడారం మీడియా పాయింట్ లో విలేకరులతో మాట్లాడారు.

గుడి, బడి లను అడ్డంపెట్టుకుని రాజకీయం చేయడం బీజేపీకి అలవాటు
ప్రజలు పవిత్రంగా చూసే గుడి, బడి లను అడ్డంపెట్టుకుని రాజకీయం చేయడం బీజేపీకి అలవాటని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల సెంటిమెంటుతో కూడా రాజకీయాలు అవసరమా అని తెలంగాణ మంత్రులు ప్రశ్నించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో సీఎం కేసీఆర్ ఆదేశానుసారంగా ఏడాదిగా మేడారం మహాజాతర ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఏనాడూ తాము రాజకీయాలు మాట్లాడలేదని, కానీ ఈ రోజు బీజేపీ నేతలు జాతర ప్రాంగణంలో చేసిన విమర్శలకు సమాధానం ఇవ్వడం బాధ్యతగా భావించి మాట్లాడుతున్నాం అని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిలు స్పష్టం చేశారు.

ఆదివాసీల జాతర అనే జాతీయ పండుగగా ప్రకటించడం లేదా?
చుట్టపుచూపుగా దర్శనానికి వచ్చి రాజకీయాలు చేశారని మండిపడ్డారు. ఈ పవిత్ర స్థలంలో రాజకీయాలకు తావులేకున్నా బీజేపీ వైఖరిని, రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఏర్పడిందని మంత్రులు పేర్కొన్నారు. కేంద్ర నిదులతో ఇదే బిజెపి కుంభమేళాను నిర్వహిస్తున్నది. 325 కోట్లు కేటాయిస్తున్నదని, కుంభమేళా లాంటి స్థాయి ఉన్న మేడారం జాతర ఏమి పాపం చేసిందని ప్రశ్నించారు. ఆదివాసీల జాతర అవడం వల్లే బీజేపీ మేడారానికి నిధులు ఇవ్వడం లేదా? జాతీయ పండుగగా ప్రకటించడం లేదా? అని మంత్రులు నిలదీశారు.

తెలంగాణాకు గిరిజన యూనివర్సిటీ ఏమైంది
కేవలం మొక్కుబడిగా 2 కోట్లు 50 లక్షలు ప్రకటించి చేతులు దులుపుకున్నారని ద్వజమెత్తారు. మేడారం జాతరను జాతీయ పండుగ'గా ప్రకటిస్తామన్నారు ప్రకటించారా? తెలంగాణకు గిరిజన యూని వర్సిటీ అన్నారు ఇచ్చారా అంటూ ప్రశ్నలు సంధించారు. జాకారం వద్ద స్థలాన్ని కేటాయించి ఏళ్లు గడుస్తున్నా యూనివర్సిటీ జాడ లేదని మండిపడ్డారు. ఆంధ్రాలో క్లాసులు నిర్వహిస్తున్నారు. 784 కోట్లు కేటాయించారు. వాళ్ళ 1058 కోట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. మా గిరిజన బిడ్డలు మీకు కనిపించడం లేదా? మా జాతర జాతరలాగా అనిపించడం లేదా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ అన్నా, తెలంగాణ ప్రజలు అన్నా మీకు లెక్కలేదు అని మంత్రులు మండిపడ్డారు. ఇంత నిర్లక్ష్యం, వివక్ష చూపిస్తారా? అని మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణా విభజన హామీలు ఏమయ్యాయి
తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ అంటూ బిజెపి కి సూటి ప్రశ్నలు సంధించారు. దేశంలో రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. గిరిజనుల కోసం ఏం చేశారని, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం చేస్తే దిక్కులేదని మండిపడ్డారు. నిజామాబాద్ కు పసుపు బోర్డు వచ్చిందా అని ప్రశ్నించారు. బిజెపి నాయకులు తెచ్చిన ఒక ప్రాజెక్టు చెప్పాలని, బిజెపి నాయకులు తీసుకొచ్చిన నిధులు ఏమిటో చూపించాలని సవాల్ విసిరారు.

మోడీ తెలంగాణ ఏర్పాటును అవమాన పరిస్తే నోరు విప్పని సన్నాసులు, చవటలు
పార్లమెంటులో మోడీ తెలంగాణ ఏర్పాటును అవమాన పరిస్తే నోరు విప్పని సన్నాసులు, చవటలు అంటూ తెలంగాణ బిజెపి నేతలపై మండిపడ్డారు. మీరా తెలంగాణ గురించి, తెలంగాణ తెచ్చిన సీఎం కేసీఆర్ గురించి మాట్లాడేది? అని ప్రశ్నించారు. కెసిఆర్ అమలు చేస్తున్న పథకాలు మీ రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నాయా?రైతు బంధు, మిషన్ భగీరథ పథకాలను పక్క రాష్ట్రాలు కాపీ కొట్టారని పేర్కొన్నారు . రైతు బంధుకు మేమిస్తున్న నిధులైనా ఇస్తున్నారా? మిషన్ భగీరథ కు నయా పైస ఇచ్చారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మాట్లాడితే ప్రజలు నమ్మురని పేర్కొన్న తెలంగాణ మంత్రులు, రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే మీ కలలు నిజం కావు కానివ్వం అని తేల్చి చెప్పారు.నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బీజేపీ నేతలకు హితవు పలికారు.












Click it and Unblock the Notifications