కేసీఆర్ కడుపంతా విషమే, అవి పగటి కలలు!
కాంగ్రెస్ పార్టీపై వరంగల్ సభలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన విమర్శలకు తెలంగాణ మంత్రులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్న ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ మనసంతా విషంతో నిండిపోయిందని విమర్శించారు. కేసీఆర్ ప్రసంగం మొత్తంలో కాంగ్రెస్ పార్టీని విలన్‌లా చిత్రీకరించం తప్ప ఇంకేమీ లేదన్నారు.
కేసీఆర్ పరిపాలన వల్ల ధనిక రాష్ట్రం అప్పులపాలైందని విమర్శించారు. అప్పులున్నా.. తాము ప్రజలకు సంక్షేమం అందిస్తున్నామని మంత్రులు తెలిపారు. తెలంగాణను ఇచ్చినందుకు కాంగ్రెస్‌ను విలిన్‌గా చిత్రీకరిస్తున్నారా? అని ప్రశ్నించారు. సోనియా లేకుండా వందమంది కేసీఆర్‌లు వచ్చినా తెలంగాణ రాకపోయేదన్నారు. కడుపంతా విషం నింపుకొని కేసీఆర్ మాట్లాడటం బాధ కలిగించిందన్నారు.
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మంచి సలహాలు ఇస్తారనుకుంటే అలా జరగలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కేవలం రెండుసార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సచివాలయం కూడా కేసీఆర్ రాలేదని మండిపడ్డారు. కేసీఆర్ దొర మాదిరిగా పరిపాలిస్తే.. తమ ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు అందుబాటులో ఉందని మంత్రులు తెలిపారు.

ప్రజలకు కాంగ్రెస్ అందిస్తున్న మంచి పాలన గురించి తట్టుకోలేక కేసీఆర్ విషం కక్కారని విమర్శించారు. గతంలో వరి వేస్తే ఉరి అని చెప్పింది కేసీఆర్ అని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు రూ. 82 వేల కోట్లు బకాయిలు పెట్టిందన్నారు. అధికారంలోకి రావాలని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని మంత్రులు ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ సభకు ఆటంకాలు సృష్టించామని కేసీఆర్ ఆరోపించారు.. అలా చేస్తే సభ జరిగేదా? అని ప్రశ్నించారు.
యూనివర్సిటీ ఆస్తులు అమ్ముతున్నామని కేసీఆర్ ఆరోపించారు.. అసలు తాము యూనివర్సిటీ ఆస్తులు ఎక్కడ విక్రయించామని మంత్రలు నిలదీశారు.ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తుందన్నారు. కేసీఆర్ తెచ్చిన ధరణిలో ఎన్ని కుంభకోణాలు జరిగాయో అందరికీ తెలుసన్నారు. కేసీఆర్ అనేక హామీలిచ్చి నెరవేర్చలేదని అన్నారు. అధికారం పోయిందనే అక్కసుతోనే కేసీఆర్ విమర్శలు చేస్తున్నారన్నారు.
కేసీఆర్ తన హయాంలో నియంతలా వ్యవహరించారని మంత్రులు మండిపడ్డారు. ధర్నా చౌక్ ను తొలగించింది కేసీఆర్ అని గుర్తు చేశారు. అసెంబ్లీలో మాట్లాడే సమస్యలను ఉత్తికబుర్లని అవమానించారు. అలాంటి వ్యక్తికి మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టే నైతిక హక్కు ఉందా? అని కేసీఆర్ పై మంత్రులు విరుచుకుపడ్డారు. ప్రజలు ఓడించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన కేసీర్ గర్వం పోలేదన్నారు. కేసీఆర్ అవకాశవాదిగా మాట్లాడారన్నారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ అనలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినవారికి ఆ సభా వేదికపై ఎందుకు నివాళి అర్పించలేదన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వగలరా? అని కేసీఆర్ ను మంత్రులు ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications