తెలంగాణ ఎన్నికల్లో పెరిగిన కాంగ్రెస్ బలం: హస్తం వైపు మళ్లిన ఆ వర్గం ఓటుబ్యాంక్
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార జోరు పెరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి. ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది.
ఈ పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలం ఒక్కసారిగా పెరిగింది. తెలంగాణలోని అనేక అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మెజారిటీ సంఖ్యలో ఉన్న ముస్లింలు ఏకం అయ్యారు. కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. మొన్నటివరకు భారత్ రాష్ట్ర సమితి వెంట ఉంటూ వచ్చిన ఈ మైనారిటీ ఓటుబ్యాంకు.. కాంగ్రెస్ వైపునకు మళ్లడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
తమ హామీలను నెరవేర్చకపోవడం, బీజేపీతో బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందాలను కుదుర్చుకుందనే అనుమానాలు వ్యక్తమౌతోండటం, మేనిఫెస్టోలో డిమాండ్లను చేర్చకపోవడం వంటి కారణాలతో బీఆర్ఎస్‌కు తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్స్ ఐక్య కార్యాచరణ కమిటీ దూరమైంది.
ఆ అసెంబ్లీ ఎన్నికల్లో తాము బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వట్లేదని ప్రకటించింది. కాంగ్రెస్‌కు అండగా ఉంటామని తెలిపింది. తమను సంప్రదించకుండా మేనిఫెస్టోను ప్రకటించిందని, గతంలో ఇచ్చిన హామీలను విస్మరించిందని ముస్లిం సంఘాల జేఏసీ విమర్శించింది. తాము సూచించిన 22 డిమాండ్లల్లో ఏ ఒక్క దాన్ని కూడా బీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో చేర్చలేదని ఆరోపించింది.
ఎన్నికల ప్రచార సభల్లోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ గానీ, మంత్రి కేటీఆర్ గానీ ఎక్కడా ముస్లింలకు ఇచ్చిన హామీల గురించి ప్రస్తావిొంచట్లేదని జేఏసీ ధ్వజమెత్తింది. కాంగ్రెస్ మాత్రం దీనికి భిన్నంగా- తన మైనారిటీ డిక్లరేషన్‌పై తమను సంప్రదించిందని తెలిపింది. దీనితో పాటు తమ ఎనిమిది ప్రధాన డిమాండ్లను కూడా మేనిఫెస్టోలో చేర్చిందని, మైనారిటీ సబ్ ప్లాన్ వంటి కీలక హామీలను ఇచ్చిందని గుర్తు చేసింది.

బీఆర్ఎస్ తమ డిమాండ్లను ఉద్దేశపూరకంగానే పక్కన పెట్టిందని, దీనికి ప్రధాన కారణం- కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పరస్పర రాజకీయ అవగాహన ఉండటమేనని ఆరోపించింది. బీఆర్ఎస్- బీజేపీ మధ్య కొనసాగుతున్న రహస్య మైత్రిని తెలంగాణ ముస్లిం సమాజంగా గమనించిందని, అందుకే అధికార పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు వివరించింది.
12 శాతం ముస్లిం రిజర్వేషన్లను కల్పిస్తామంటూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నోసార్లు ప్రకటించిందని, ఇప్పటికీ దాని ఊసే లేదని, మేనిఫెస్టోలో కూడా ఈ అంశం లేదని పేర్కొంది. ఈ నెల 30వ తేదీన జరిగే పోలింగ్ సందర్భంగా ముస్లింలు అందరూ కాంగ్రెస్‌కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు జేఏసీ నాయకులు.












Click it and Unblock the Notifications