తెలంగాణ సొంతగా ఫిల్మ్ అవార్డులు: కమిటీలో ఏపీ వారు, వారికి నో ఛాన్స్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు ఫిల్మ్ అవార్డులు సొంతగా ఇచ్చేందుకు ముందుకు వెళ్తోంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాడు చంద్రబాబు ఉగాది రోజున నంది అవార్డులు ఇచ్చేవారు. రాష్ట్ర విభజన తర్వాత ఇది ఆగిపోయింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం సొంతగా అవార్డులు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.
తెలుగు సినిమాలకు అవార్డుల కోసం ప్రభుత్వం బుధవారం నాడు ఏ కమిటీని ఏర్పాటు చేసింది. అవార్డుల కోసం సినిమాలను ఆ కమిటీ ఎంపిక చేయనుంది.
సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ మొత్తానికి అవార్డులు ఉంటాయని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే భేదం లేదని చెప్పారు. హైదరాబాద్ తెలుగు సినిమా పరిశ్రమకు అడ్డా అని, తమ అవార్డులకు అన్ని సినిమాలను తాము పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు.

ఈ అవార్డులకు కాకతీయ, యాదాద్రి అనే పేర్లు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయమేమంటో తెలంగాణ ప్రభుత్వం 8 మంది సభ్యులతో కూడిన కమిటీని వేసింది. ఇందులో తెలంగాణతో పాటు ఏపీ సినిమా వారికి కూడా చోటు కల్పించింది.
రామ్మోహన్ రావు, కె మురళీ మోహన్ (తెలంగాణ ఫిలిమ్ చాంపర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మరియు కార్యదర్శి), ప్రముఖ దర్శకులు శంకర్‌లకు తెలంగాణ నుంచి చోటు కల్పించారని తెలుస్తోంది. ఏపీకి చెందిన తమ్మారెడ్డి భరద్వాజ, శ్యాంప్రసాద్ రెడ్డి, సురేష్ కొండేటిలకు చోటు దక్కిందని తెలుస్తోంది.
కమిటీకి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి చైర్మన్‌గా, ఐపీఎస్ అధికారి నవీన్ మిట్టల్ కన్వీనర్‌గా ఉన్నారు.
కాగా, విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాలు కూడా వేర్వేరుగా అవార్డులు ఇచ్చే అవకాశాలున్నాయి. మంత్రి తలసాని మాట్లాడుతూ... ఏపీ ప్రభుత్వం నంది అవార్డులు ఇచ్చుకుంటే తమకు అభ్యంతరం లేదని, తాము మాత్రం సొంతగా ఇస్తామని చెప్పారు. తమ్మారెడ్డి, ఎన్ శంకర్, శ్యాంప్రసాద్ రెడ్డిలు గతంలో నంది అవార్డుల కమిటీలో పని చేశారు. మరో ఆసక్తిర విషయమేమంటే దాసరి నారాయణ రావు, సురేష్ బాబు వంటి ప్రముఖులకు చోటు దక్కలేదు.












Click it and Unblock the Notifications