కేంద్ర హోంశాఖా సహాయ మంత్రికి పోలీసుల బిగ్ షాక్!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో జరుగుతున్న ఉప ఎన్నికలలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు తమ అభ్యర్థుల గెలుపు కోసం హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగగా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా కేటీఆర్ రోడ్ షో లతో అదరగొట్టారు.
బండి సంజయ్ కు షాక్
బిజెపి తరఫున లంకల దీపక్ రెడ్డి కోసం కేంద్ర మంత్రులు రంగంలోకి దిగి ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే ఈ క్రమంలో తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. బోరబండలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మీటింగ్ కు పోలీసులు అనుమతిని రద్దు చేశారు.

బోరబండలో మీటింగ్ అనుమతి రద్దు
షెడ్యూల్ ప్రకారం ఈరోజు సాయంత్రం బోరబండలో కొనసాగాల్సిన బండి సంజయ్ మీటింగ్ కు అనుమతిని రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. దీంతో పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి ఇచ్చి రద్దు చేయడమేంటని ప్రశ్నించిన బీజేపీ ఎన్నికల ఇంఛార్జీ ధర్మారావు కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి పోలీసులు తలొగ్గడమేంటని నిలదీశారు. సాయంత్రం బోరబండలోనే మీటింగ్ జరిపి తీరుతామని స్పష్టం చేశారు.
పోలీసుల తీరుపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం
బీజేపీ శ్రేణులంతా భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ వ్యవహారంలో ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచన చేశారు. బండి సంజయ్ సభకు ఆటంకాలు లేకుండా సహకరించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని వెల్లడించారు. మరోవైపు పోలీసుల తీరుపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎవరు అడ్డుకుంటారో చూస్తా అంటూ సవాల్
బోరబండకు నేనొస్తున్నా.... ఎవరు అడ్డుకుంటారో చూస్తా అంటూ సవాల్ విసిరారు. ఇట్లాంటి అడ్డంకులు బీజేపీ ఎన్నో ఎదుర్కొని పోరాడింది అని గుర్తు చేశారు. సాయంత్రం బోరబండ కు అందరూ తరలిరావాలని బిజెపి కార్యకర్తలకు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు సాయంత్రం బీజేపీ దమ్మేంటో చూపిద్దాం అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications